
చెరుకు రైతులను ఆదుకోవాలి
అమరచింత: ఫ్యాక్టరీకి తరలించిన చెరుకులో రికవరీ శాతాన్ని పెంచి చెరుకు రైతులను ఫ్యాక్టరి యాజమాన్యం ఆదుకోవాలని కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఉమ్మడి జిల్లా గౌరవ సలహాదారుడు సీహెచ్ రాంచందర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న డిమాండ్ చేశారు. కొత్తకోట మండలంలోని ఆమడబాకుల రైతువేదికలో బుధవారం ఏర్పాటు చేసిన చెరుకు రైతుల ఉమ్మడి జిల్లా సమావేశంలో పాల్గొని చెరుకు రైతుల సమస్యల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం గత సీజన్లో ప్రకటించిన సబ్సిడీలను ఈ సీజన్‌లో సైతం అమలు చేస్తున్న యాజమాన్యం రికవరీ శాతాన్ని 11నుంచి 12శాతానికి పెంచాలన్నారు. సబ్సిడీలను 2026 నుంచి 2027వరకు కొనసాగించాలన్నారు. కోతలకు సరిపడా మిషన్లు ఏర్పాటు చేసి 40, 50 ఎకరాల రైతులను గ్రూపులుగా చేసి కోతలను ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. కోతలు ముగిసే వరకు నిర్ణయించిన ధరలకే కోయించాలన్నారు. చెరుకు రైతులకు ప్రమాదాలు నష్టాలు జరిగినప్పుడు ట్రాన్స్‌పోర్టు భరించాలన్నారు. ఫ్యాక్టరీకి పంపిన 14రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులను జమ చేయాలని యాజమాన్యానికి విన్నవించడం జరిగిందన్నారు. చెరుకు కోతల సమయాన్ని రైతులకు ముందస్తుగా ప్రకటించడమే కాకుండా వారి పంటలను ఎప్పుడు ఫ్యాక్టరీకి తరలిస్తారనే విషయాలను వివరించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఫ్యాక్టరి ఈడీ రవికుమార్, వీపీ రామరాజు, కేన్ డీజీఎం నాగార్జునరావుకు అందించామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా చెరుకు సంఘం ఉపాధ్యక్షుడు వాసారెడ్డి, ప్రధాన కార్యదర్శి జింక రవి, చంద్రసేనారెడ్డి, ఆయా జిల్లాల చెరుకు రైతులు పాల్గొన్నారు.