
డీపీఓగా నిఖిలశ్రీ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా పంచాయతీ అధికారిగా నిఖిల శ్రీ నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో ఈమె ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం డీపీఓగా విధులు నిర్వహిస్తున్న పార్థసారధిని బదిలీ చేస్తూ సపోర్టింగ్ ఆర్డర్ రాలేదని తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
భూసేకరణకు రైతులు సహకరించాలి
అడ్డాకుల: మండలంలోని ముత్యాలంపల్లి శివారులో ఉన్న రైల్వే ట్రాక్‌ను బుధవారం రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్‌డీఓ నవీన్ పరిశీలించారు. మహబూబ్‌నగర్ నుంచి డోన్ వరకు రైల్వే డబుల్ లైన్ పనుల నిమిత్తం చేయాల్సిన భూసేకరణపై ముత్యాలంపల్లి గ్రామానికి చెందిన రైతులతో అధికారులు మాట్లాడారు. రైల్వే ట్రాక్ వద్ద భూసేకరణకు సంబంధించిన అంశాలపై రెవెన్యూ అధికారులతో మాట్లాడి వివరాలపై అడిషనల్ కలెక్టర్ ఆరా తీశారు. ట్రాక్ సమీపంలో భూములు ఉన్న రైతులతో మాట్లాడి రైల్వే డబుల్ లైన్ పనుల కోసం భూసేకరణకు సహకరించాలని కోరారు. భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వ పరిహారం చెల్లిస్తుందని తెలిపారు. దీనికి రైతులు కూడా సమ్మతించి మార్కెట్‌లో ఉన్న ధర చెల్లించాలని కోరారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి రైతులకు నష్టం జరగకుండా తగిన పరిహారం అందేలా చూస్తామని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. తహసీల్దార్ శేఖర్, గిర్దావర్ శశికిరణ్, సర్వేయర్ పార్వతమ్మ తదితరులు ఉన్నారు.
మార్కెట్ కళకళ..ధాన్యం సీజన్ ప్రారంభం
దేవరకద్ర/జడ్చర్ల: ధాన్యం సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ మార్కెట్ యార్డులు కళకళలాడుతున్నాయి. వానాకాలం పంట కింద సాగు చేసిన వరి కోత దశకు రావడంతో చాలామంది రైతులు కోతలు ప్రారంభించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో వరి పంట రికార్డు స్థాయిలో సాగైంది. ఒక్క కోయిల్‌సాగర్ ఆయకట్టు కింద దాదాపు 40 వేల ఎకరాల వరి సాగుచేశారు. అలాగే చెరువులు, బావుల కింద అదనంగా వరి పంట వేశారు. దిగుబడులు కూడా బాగా వస్తుండడంతో మార్కెట్‌లో సీజన్ జోరుగా సాగే అవకాశం ఉంది. దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,121, కనిష్టంగా రూ.2,079గా ధరలు లభించాయి. హంస ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,803, కనిష్టంగా రూ.1,757గా ధరలు నమోదయ్యా యి. ఆముదాలు క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 5,804, కనిష్టంగా రూ.5,779గా ధరలు పలికాయి. మార్కెట్‌కు రెండు వేల బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. బాదేపల్లి మార్కెట్‌లో పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,769, కనిష్టంగా రూ.6,521 ధరలు లభించాయి. మొక్క జొన్న గరిష్టంగా రూ.2,041, కనిష్టంగా రూ.1,600, వేరుశనగ రూ.4,331 ధరలు పలికాయి.
మద్దతు ధరలు లభించేలా చర్యలు
జడ్చర్ల: రైతులకు మద్దతు ధరలు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ జ్యోతి తెలిపారు. బుధవారం మార్కెట్ యార్డు ఆవరణలో పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. ఇక ప్రతి బుధ, శనివారాల్లో బాదేపల్లి మార్కెట్ యార్డు ఆవరణలో పత్తి కొనుగోళ్లు జరుగుతాయన్నారు. రైతులు నాణ్యమై పత్తిని తీసుకొచ్చి మద్దతు ధరలు పొందాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ ప్రసాదరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ పుష్పలత, మార్కెట్ వైస్ చైర్మన్ రాజేందర్‌గౌడ్, శివకుమార్, నిత్యానందం, వెంకటయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

డీపీఓగా నిఖిలశ్రీ

డీపీఓగా నిఖిలశ్రీ