
చెక్‌పోస్టులు ఎత్తేశారు!
పాలమూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో సరిహద్దులో ఉన్న ఆర్టీఏ చెక్‌పోస్టులు రద్దు చేస్తున్నట్లు, బుధవారం సాయంత్రం 5 గంటల నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని అధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కోసం ఏర్పాటు చేసిన జోగుళాంబ గద్వాల జిల్లా జల్లాపురం ఆర్టీఏ చెక్‌పోస్టు, కర్ణాటక కోసం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం దగ్గర ఏర్పాటు చేసిన రెండు చెక్‌పోస్టులను ఎత్తేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక రాష్ట్రాల సరిహద్దుల్లో వస్తువుల తనిఖీ, పన్ను వసూళ్ల అవసరం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో చెక్‌పోస్టులను తొలగించాలని రాష్ట్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకోగా ప్రస్తుతం అమల్లోకి వచ్చింది.
● జిల్లాలోని ఆర్టీఏ చెక్‌పోస్టులు అక్రమ వసూళ్లకు కేంద్రంగా మారాయని తాజాగా ఏసీబీ జరిపిన దాడుల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు నేరుగా ముడుపులు తీసుకోకుండా ప్రైవేట్ ఏజెంట్లను నియమించుకుని మరీ లారీ డ్రైవర్ల ముక్కు పిండి వసూలు చేసినట్లు తనిఖీల్లో బహిర్గతమైంది. ఇటీవల కృష్ణా చెక్‌పోస్టులో ఏసీబీ బృందం దాడులు నిర్వహిస్తుండగానే మరోవైపు లారీ డ్రైవర్లు వచ్చి టేబుల్‌పై డబ్బులు పెట్టడాన్ని చూసి తనిఖీకి వచ్చిన ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి ముడుపుల వ్యవహారానికి తెరపడినట్లే.
ఉమ్మడి జిల్లాలో అలంపూర్, కృష్ణా వద్ద చెక్‌పోస్టులు
బుధవారం సాయంత్రం నుంచే మూసివేసినట్లు డీటీసీ ప్రకటన
అధికారులు, సిబ్బందిని ఆర్టీఏ కార్యాలయాల్లో సర్దుబాటు