
మధ్యాహ్న భోజనంలో పురుగులు
● వాంతులు చేసుకున్న విద్యార్థులు
● మూడు రోజుల నుంచి ఇదే తీరు
● పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
మక్తల్: పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పా ఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో బుధవారం విద్యార్థులు భోజనం చేయకుండా ఇంటికి వెళ్లారు. పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దాదాపు 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజ నం సక్రమంగా వండటం లేదని మూడు రోజు ల నుంచి ఉపాధ్యాయులు, హెచ్‌ఎంకు చెప్పి నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. గతంలో కలెక్టర్ పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వంట ఏజెన్సీ మహిళలను ఆదేశించారు. కలెక్టర్ చెప్పినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థులు వాపోతున్నారు. విషయం బయటకు రావడంతో ఏబీవీపీ నాయకులు వినయ్‌తో పాటు మరికొందరు అక్కడికి చేరుకొని పురుగుల అన్నాన్ని పరిశీలించారు. సమస్యను ఎంఈఓ అనిల్‌గౌడ్‌కు వివరించగా.. ఆయన అక్కడికి చేరుకున్నారు. వంటలు సక్రమంగా చేయడం లేదని, నీళ్ల సాంబర్ వడ్డిస్తున్నారని విద్యార్థులు ఎంఈఓ దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన ఎంఈఓ వంట ఏజెన్సీ వారిని వెంటనే తొలగించి, కొత్తవారికి అప్పగించాలని హెచ్‌ఎంను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారంగా మధ్యాహ్న భోజనం అందించాలని, లేకుంటే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నప్పటికీ ఉపాధ్యాయులు విషయాన్ని బయటకు రానివ్వడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం లేదని, తూతూమంత్రంగా విధులు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. భోజనం వండిన తర్వాత మొదటగా హెచ్‌ఎం పరిశీలించిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని కలెక్టర్ ఆదేశించినా బేఖాతరు చేస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నోసార్లు జరిగాయని, బియ్యంలో పురుగులను సక్రమంగా తీయడం లేదని తెలిపారు. గోదాం నుంచి పాత బియ్యం తెచ్చారా.. లేక పాఠశాలలో మక్కిన బియ్యంతో అన్నం వండారా అని విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఎంఈఓ తెలిపారు.
చిన్నచింతకుంట: మండలంలోని లాల్‌కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులక వడ్డించే మధ్యాహ్నం భోజనంలో కప్ప కనిపించిందని వదంతులు వచ్చాయి. నిత్యం పాఠశాలకు అక్షయ పాత్ర ద్వారా 270మంది విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందుతుంది. బుధవారం పాఠశాలలో సిబ్బంది విద్యార్థులకు భోజనం వడ్డిస్తుండగా.. ఓ విద్యార్థి అన్నం పెట్టుకొని పప్పు వేసుకోగానే కప్ప కనిపించిందని.. విద్యార్థులు, ఉపాధ్యాయులు భోజనాన్ని పార బోసినట్లు సమాచారం. అనంతరం విద్యార్థులు తమ ఇళ్లలోకి వెళ్లి భోజనం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై హెచ్‌ఎం, ఎంఈఓ మురళికృష్ణను వివరణ కోరగా.. కప్ప ఉందన్న పుకార్లు మాత్రం ఉన్నాయన్నారు. కప్ప కనిపించిన ఆధారాలు ఎక్క డాలేవని తెలిపారు. ప్రస్తుతం చిన్నచింతకుంటలో సమావేశంలో ఉన్నందున పాఠశాలకు అందుబాటులో లేనన్నారు. పూర్తి సమాచారం తెలుసుకొని విచారణ చేపట్టనున్నట్లు ఎంఈఓ పేర్కొన్నారు.
కప్ప ఉందని వదంతులు

మధ్యాహ్న భోజనంలో పురుగులు