
ఆధునిక పద్ధతులు అవలంబించాలి
మహబూబ్‌నగర్ రూరల్: పంటల సాగుకోసం రైతులు ఆధునిక పద్ధతులను అవలంబించాలని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శశిభూషణ్ అన్నారు. బుధవారం మండలంలోని మాచన్‌పల్లి రైతువేదికలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వనపర్తి మహాత్మా జ్యోతిభా ఫూలే ఉమెన్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రైతులు పంటల సాగుకు ముందు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుని వ్యవసాయరంగ నిపుణుల సూచనలు, సలహాల మేరకు పంటలను సాగుచేయాలని తెలిపారు. పంటల సాగులో తగిన మెలకువలు పాటించాలని, తక్కువ రసాయనిక ఎరువులు వాడాలన్నారు. పురాతన పనిముట్లను వీడి ఆధునిక పరికరాలతో పంటలు సాగు చేస్తే సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి అవగాహన పెంపొదించడానికి ప్రభుత్వం సదస్సులు నిర్వహిస్తుందని, రైతులు సదస్సులను సద్వినియోగం చేసుకుని పంటల దిగుబడిని పెంచుకొని లాభాలు పొందాలని సూచించారు. అనంతరం ఆధునిక వ్యవసాయ పరికరాల గురించి రైతులకు వ్యవసాయ కళాశాల విద్యార్థినులు అవగాహన కల్పించారు. సేంద్రియ వ్యవసాయమే రైతులకు శ్రీరామ రక్ష అని, దానినుంచి ఉత్పత్తయ్యే అన్నిరకాల ధాన్యాలు ప్రజలకు ఎంతగానో మేలు చేస్తాయని అభిప్రాయ వ్యవసాయ కళాశాల విద్యార్థినులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విజ్ఞాన కేంద్రం సమన్వయకర్తలు అర్చన, కల్యాణి, ఏఓ శృతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లికార్జున్‌రెడ్డి, మల్లు వెంకటేశ్వర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.