
పులుల సంరక్షణలో కలిసి పనిచేయడం కీలకం
దోమలపెంట: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని నల్లమల అడవులలో పులుల సంరక్షణలో సహకార ప్రయత్నాలను బలోపేతం చేయడం కో సం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఏటీఆర్) మరి యు నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టీఆర్) అంతర్రాష్ట్ర సమావేశాన్ని సోమవారం దోమలపెంటలోని అటవీ శాఖ కార్యాలయం వనమయూరిలో నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఏలూసింగ్ మేరు ముఖ్య అతిథిగా పాల్గొని మార్గ నిర్దేశం చేశారు. రాబోయే అఖిల భారత పులుల అంచనా కోసం వ్యూహాత్మక సన్నాహాలు చేయడం, జాతీయ సంరక్షణ ప్రణాళికకు ఇది కీలకం అని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల సహకారానికి సంబంధించి ముఖ్యమైన అంశాలపై చర్చించి తుది నిర్ణయాలను తీసుకున్నారు. అడవుల్లో వేట, అక్రమ కార్యకలాపాలను సమర్థవంతంగా అరికట్టడానికి ఏటీఆర్, ఎన్‌ఎస్‌టీఆర్ రిజర్వ్‌ల వద్ద సంయుక్త గస్తీని చేయడం కొరకు సమన్వయం పాటించాలని నిర్ణయించారు. పులుల డేటా భాగస్వామ్యం కొరకు ఖచ్చితమైన పర్యవేక్షణ, సంరక్షణ నిర్ణయాల కోసం ఫొటోగ్రాఫిక్ ఆధారాలను, కదలికల నమూనాలతో సహా పులుల డేటాను నిరంతరాయంగా ఇచ్చిపుచ్చుకోవడం కొరకు యంత్రాలను ఏర్పాటు చేసుకోవడంపై చర్చించారు. అలాగే, వన్యప్రాణుల కారిడార్ నిర్వహణ, అగ్ని నివారణ, మానవ మరియు వన్యప్రాణుల సంఘర్షణను పరిష్కరించడం వంటి వాటికి సంబంధించిన ప్రయత్నాలను సమకాలీకరంచడం కొరకు పాల్గొనే వారి నిర్దిష్ట సహకార ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. సమావేశంలో రెండు పులుల సంరక్షణ ప్రాంతాల నుంచి ఫీల్డు డైరెక్టర్లు, డిఎఫ్‌ఓలు, ఎఫ్‌డిఓలు, ఎఫ్‌ఆర్‌ఓలు, కీలకమైన క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.