
గురుకులాలు, హాస్టళ్లను తనిఖీ చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లా, మండల ప్రత్యేకాధికారులు సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల పాఠశాలలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాల ని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడా రు. వివిధ శాఖల అధికారులు వారికి కేటాయించిన హాస్టళ్లు, గురుకులాలు, కేజీబీవీలను ప్రతినెలా మొ దటి వారంలో తనిఖీ చేసి.. సంబంధిత రిపోర్టును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. హాస్టళ్లలో పరిస్థితులను మెరుగుపరచాలని, ముఖ్యంగా మెనూ పాటించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అంశాలపై షోకాజ్ జారీ చేయాలని ఆదేశించారు.
16న గవర్నర్ పర్యటన..
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ జిల్లాకు రానున్నారని కలెక్టర్ వెల్లడించారు. గురువారం ఉదయం 11 గంటలకు 12.30 గంటలకు వరకు పాలమూరు యూనివర్సిటీలో జరిగే స్నాతకోత్సవానికి చాన్స్‌లర్‌గా అధ్యక్షత వహిస్తారన్నారు. అనంతరం మధ్యాహ్నం 2.10 నుంచి 2.45 గంటల వరకు కలెక్టరేట్‌లో టీబీ అధికారులు, రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులతో సమావేశమవుతారని, 2.45 గంటలకు రచయితలు, కళాకారులు, ప్రముఖులతో ముఖాముఖిలో పాల్గొంటారని పేర్కొన్నారు. గవర్నర్ పర్యటన సందర్భంగా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టరేట్‌లో ప్రొటోకాల్ ఏర్పాటు ఆర్‌డీఓ, తహసీల్దార్, బందోబస్తు ఏర్పాట్లు పోలీసు, శాఖ పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్‌నాయక్, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, ఆర్‌డీఓ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఆర్‌పై అవగాహన అవసరం
ఆకస్మిక కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తులకు సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడవచ్చని, దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కొందరికి అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టు జరిగి వచ్చిన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అలాంటి వారికి సీపీఆర్‌తో ప్రథమ చికిత్స చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడుతారన్నారు. కార్డియాక్ హెల్త్ కేర్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు జిల్లాలోనూ ఈ నెల 13 నుంచి 17 వరకు వారం రోజుల పాటు సీపీఆర్‌పై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. వైద్యాధికారులు మనుప్రియ, శివకాంత్ ప్రయోగ పూర్వకంగా సీపీఆర్ ఎలా చేయాలో క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ పద్మజ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.