
పాఠశాల స్థలంపై రియల్టర్ల కన్ను
సాక్షి, నాగర్‌కర్నూల్: పెరుగుతున్న భూముల ధరలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ప్రభుత్వ, అసైన్డ్ భూములు, ఖాళీ స్థలాలపై కన్నేస్తున్న అక్రమార్కుల చూపు ఏకంగా సర్కారు బడి జాగాపై పడింది. ఆరు దశాబ్దాలుగా ప్రభుత్వ ఆస్పత్రి, ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాల కొనసాగుతున్న స్థలాన్ని కాజేసేందుకు కొందరు రియల్టర్లు కుట్ర పన్నుతున్నారు. ఇందుకు ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడు, మాజీ ప్రజాప్రతినిధి అండగా ఉండి.. పట్టా మార్పిడిలో అన్నీ తానై వ్యవహరించడం గమనార్హం.
1961లో పీహెచ్‌సీ ఏర్పాటు..
బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలోని సర్వే నం.23లో ఉన్న 1.30 ఎకరాల భూమిని పీహెచ్‌సీ కోసం సంబంధిత యజమాని ప్రభుత్వానికి దానంగా ఇచ్చారు. 1961 మే 12న అప్పటి ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య చేతుల మీదుగా ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించారు. తర్వాత ఆస్పత్రిని మరోచోట విశాలమైన భవనంలోకి మార్చగా.. పాత భవనంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటం.. రూ.కోట్లు విలువ చేసే స్థలం కావడంతో కొందరు రియల్ వ్యాపారుల కన్ను పడింది. ఇందుకోసం ముందస్తు ప్రణాళికతో స్థలాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పాఠశాల స్థలం నుంచి 23 గుంటల భూమిని 2012లో బిజినేపల్లికి చెందిన ఓ వ్యక్తి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోగా.. తర్వాత 2015లో సదరు భూమిని భూత్పూర్‌కు చెందిన రియల్ వ్యాపారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. పాఠశాల స్థలంలోని రోడ్డువైపు ఉన్న 6 గుంటల స్థలంలో కమర్షియల్ షెట్టర్లు, షాపుల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. పాఠశాల స్థలం అన్యాక్రాంతమవుతున్నట్టు గుర్తించిన గ్రామస్తులు.. ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్‌ను కలసి ఫిర్యాదు చేశారు.
ప్రధాన రహదారి పక్కనే ఉన్న భూమిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు
బిజినేపల్లి జెడ్పీహెచ్‌ఎస్
స్థలంలో కమర్షియల్ షాపుల
ఏర్పాటుకు పన్నాగం