
జూరాలకు 2.32 లక్షల క్యూసెక్కుల వరద
● ప్రాజెక్టు 11 క్రస్టు గేట్లు ఎత్తివేత
● 2.11 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల
ధరూరు/ఆత్మకూర్: ఎగువ నుంచి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గి నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శుకవారం రాత్రి 9 గంటల వరకు ప్రాజెక్టుకు 2.70 లక్షల క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శనివారం రాత్రి 8 గంటల వరకు 2.32 లక్షల క్యూసెక్కులకు తగ్గినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్టు 11 క్రస్టు గేట్లు ఎత్తి 1.74 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆరు యూనిట్లలో 234 మెగా వాట్ల విద్యుదుత్పత్తి చేస్తూ 30,422 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 68 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 390 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 2.11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.690 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 33.173 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 45వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 7గేట్లను ఎత్తి దిగువన ఉన్న జూరాలకు ప్రాజెక్టుకు 38,480 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 749.051 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు.
రెండ్లు గేట్ల ద్వారా..
రాజోళి: సుంకేసుల డ్యాంలో రెండు గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నట్లు జేఈ మహేంద్ర తెలిపా రు. శనివారం ఎగువ నుంచి 13,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. రెండు గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 8,821 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 2,445 క్యూసెక్కులను వదిలినట్లు ఆయన పేర్కొన్నారు.
రామన్‌పాడులో 1,021 అడుగుల నీటి మట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు గాను శనివారం 1,021 అడుగులు వచ్చి చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వార 974 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపి వేశారు. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 875 క్యూసెక్కులు, కుడి ఎడమ కాల్వ ద్వారా 50 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని ఏఈ వరప్రసాద్ తెలిపారు.
శ్రీశైలంలో ఎనిమిది గేట్లు ఎత్తివేత
దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ఆనకట్ట వద్ద ఎత్తి ఉంచిన పది గేట్లలో శనివారం రెండు గేట్లను మూసి వేసి ఎనిమిది గేట్ల ద్వారా నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 2.11 లక్షల క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 17,916, హంద్రీ నుంచి 250 మొత్తం 2,27,822 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. శ్రీశైలంలో ఆనకట్ట వద్ద ఎనిమిది గేట్లు ఒకొక్కటి పది అడుగుల మేర పైకెత్తి స్పిల్‌వే ద్వారా 2,21,664 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 65,976 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 884.2 అడుగుల వద్ద 210.9946 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 5 వేలు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,817 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 16.974 మిలియన్ యూనిట్లు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో 15.317 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు.

జూరాలకు 2.32 లక్షల క్యూసెక్కుల వరద