
పులకించిన కొండారెడ్డిపల్లి
వంగూరు: దసరా పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రావడంతో గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు హెలీకాప్టర్‌లో సీఎం కొండారెడ్డిపల్లికి చేరుకోగా.. ఎమ్మెల్యే వంశీకృష్ణ, రైతు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, బాలాజీసింగ్, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు ప్రచార రథంపై వెళ్తుండగా బతుకమ్మ, కోలాటాలతో గ్రామస్తులు అభివాదం చేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం 5.30 గంటలకు సోదరులు తిరుపతిరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, కృష్ణారెడ్డి ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి కోటమైసమ్మను దర్శించుకొని, భాజాభజంత్రీలతో భారీ ర్యాలీగా వెళ్లి జమ్మి చెట్టుకు పూజలు చేశారు. అనంతరం రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గాన కొడంగల్‌కు బయలుదేరి వెళ్లారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో..
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందుకు కలెక్టర్ బదావత్ సంతోష్‌తోపాటు ఇతర అధికారులు ముఖ్యమంత్రి పర్యటనలో కనిపించలేదు. ఏర్పాట్లను మొత్తం గ్రామస్తులే చూసుకున్నారు. కేవలం భద్రతా ఏర్పాట్లను మాత్రమే పోలీసు అధికారులు పర్యవేక్షించారు.
స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు
కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి వేడుకలకు హాజరు
ఘన స్వాగతం పలికిన ప్రజలు
భారీగా తరలివచ్చిన అభిమానులు

పులకించిన కొండారెడ్డిపల్లి