
బడి.. బహుదూరం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మున్సిపాలిటీగా ఉన్న పాలమూరు పట్టణం ఏటికేడు నలుమూలల విస్తరిస్తూ మున్సిపల్ కార్పొషన్ స్థాయికి ఎదిగింది. బైపాస్ రోడ్డు రావడం, వాటి చుట్టూ వ్యాపార సముదాయాలు పెరగడం, రియల్ ఎస్టేట్ పుణ్యమా అని అనేక కొత్త ప్రాంతాలు, గల్లీలు విస్తరించాయి. దీంతో కొత్తగా అనేక గృహసముదాయాలు వెలిశాయి. ఈ కారణంగా జనాభా సైతం భారీగా పెరిగింది. ఈ క్రమంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం 60కిపైగా మున్సిపల్ డివిజన్‌లను విస్తరించింది. కానీ, విద్యార్థులు చదువుకునేందుకు పాఠశాలలను మాత్రం ఏర్పాటు చేయలేదు. ప్రధానంగా వన్‌టౌన్ నుంచి మెట్టుగడ్డ, టీడీగుట్ట నుంచి అశోక్ టాకీస్ చౌరస్తా, న్యూటౌన్, పాతబస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్ వంటి ప్రాంతాల్లో 15 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి. కానీ, కొత్తగా ఏర్పడిన కాలనీలు, గల్లీల్లో ప్రభుత్వ బడుల ఊసేలేదు. దీంతో చాలామంది తల్లిదండులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆర్థికంగా అవస్థలు..
పట్టణ ప్రాంతాల్లో పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులకు ఆర్థికంగా భారంతో కూడుకున్న పని. వారు ఉంటున్న గృహ సముదాయాలకు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అక్కడే విద్యార్థులను చేర్పించేందుకు చాలామంది తల్లిదండ్రులు మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ, పాఠశాలలు అందుబాటులో లేకపోవడం, వారు ఉంటున్న ప్రాంతంలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు పాఠశాలలు ఉండడంతో అధిక ఫీజులు చెల్లించి పిల్లల్ని పంపించే పరిస్థితి నెలకొంది. ఆర్థిక పరిస్థితి బాగోలేని చాలామంది తల్లిదండ్రులు దూరమైనా తమ పిల్లల్ని ప్రభుత్వ బడికి పంపించేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాగా మున్సిపాలిటీ పరిధిలో కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నప్పటికీ ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ వంటి వాటిలో విద్యార్థులను చేర్పిస్తే ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా బోధించే పరిస్థితి లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటినే ఆశ్రయిస్తున్నారు.
మూడు కొత్త బడులు..
ఈ సంవత్సరం విద్యార్థులకు అందుబాటులో బడులు లేని ప్రాంతాల్లో కొత్తవి ఏరా్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ విద్యా సంవత్సరం కొత్తగా మూడు బడులను ఏర్పాటు చేశారు. ఇందులో 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని నవాబ్‌పేటలో 2, హన్వాడలో ఒక పాఠశాల కేటాయించారు. వీటితోపాటు జిల్లాకేంద్రంలోని రాజేంద్రనగర్‌లో బడి అందుబాటులో లేదని బడికి వెళ్లని 14 మందిని రిషి పాఠశాలలో, ఏనుగొండలో 16 మంది విద్యార్థులు చైతన్య సెంట్రల్ స్కూల్‌లో అధికారులు చేర్పించారు.
విస్తరిస్తున్న పాలమూరు శివారు గల్లీలు
అందుబాటులో లేని ప్రభుత్వ
పాఠశాలలు.. ప్రైవేటును
ఆశ్రయిస్తున్న విద్యార్థులు
మర్లు, భగీరథకాలనీ, బీకేరెడ్డికాలనీల్లోనూ కనిపించని వైనం
ఎటు చూసినా కిలోమీటరు
మేర వెళ్లాల్సిన పరిస్థితి
ఆర్థిక భారంతో తల్లిదండ్రుల అవస్థలు