
అంబరాన్నంటిన దసరోత్సవం
స్టేషన్ మహబూబ్‌నగర్: చేతులెత్తి ప్రణమిల్లేలా ఆకట్టుకున్న దేవతామూర్తుల వేషధారణలు.. నింగిలో మిరుమిట్లు గొలిపిన బాణాసంచా వెలుగులు.. నృత్యాలు, డప్పు మోతలు, పురవీధుల గుండా సాగిన శోభాయాత్ర, వేడుకలను తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన జనాలతో పాలమూరు నగరం పరవశించిపోయింది. జిల్లాకేంద్రంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ముందుగా ఆర్యసమాజం మందిరంలో ఉదయం 8 గంటలకు దేవయజ్ఞం, వేదోపదేశం అనంతరం మధ్యాహ్నం ఊరేగింపు ప్రారంభమైంది. ధ్వజధారి కలకొండ సూర్యనారాయణ ధ్వజాన్ని ధరించి రాంమందిర్ చౌరస్తాలోని దసరా కట్ట దగ్గర జనసమ్మేళనాన్ని నిర్వహించి ధ్వజారోహణం చేశారు. ఉత్సవ జెండాతో పాన్‌చౌరస్తా గుండా సాగిన ర్యాలీకి క్లాక్‌టవర్‌లో ఖౌమీ ఏక్తా కమిటీ ఆధ్వర్యంలో టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఖౌమీ ఏక్తా కమిటీ కార్యదర్శి రఫీక్ పటేల్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించామని, పాలమూరు ప్రజలందరి పూజలు ఫలించాలని కోరారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మనిషిలోని దుర్గుణాలను ఈ దసరా పండుగ సందర్భంగా దహనం చేద్దామన్నారు. అంతకు ముందు ప్రముఖ ధార్మికవేత్త వేదశ్రవ దసరా పండుగపై సందేశం ఇచ్చారు. అనంతరం పలు అస్త్రాల పేరుతో ఏర్పాటు చేసిన రంగురంగుల టపాసులను పేల్చగా ప్రజలు కేరింతలు కొడుతూ తిలకించారు. కార్యక్రమంలో మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, జేపీఎన్‌సీ చైర్మన్ రవికుమార్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, డాక్టర్ భరద్వాజ్ నారాయణరావు, చంద్రకుమార్‌గౌడ్, డాక్టర్ చంద్రయ్య, గోపాల్‌యాదవ్, అంజయ్య, మోహన్‌యాదవ్, మాల్యాద్రిరెడ్డి, రాములు, లక్ష్మణ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాలుర కళాశాల మైదానంలో వైభవంగా వేడుకలు
అబ్బురపరిచిన బాణాసంచా కాల్చివేత
ఆకట్టుకున్న దేవతామూర్తుల వేషధారణ
వేలాదిగా తరలివచ్చిన ప్రజలు

అంబరాన్నంటిన దసరోత్సవం

అంబరాన్నంటిన దసరోత్సవం

అంబరాన్నంటిన దసరోత్సవం