
సమస్యల పరిష్కారంలో వార్డు ఆఫీసర్లే కీలకం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తేవాలని, ఈ విషయంలో వార్డు ఆఫీసర్లే కీలకపాత్ర వహించాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. బుధవారం సాయంత్రం మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటో తరగతి నుంచి పీజీ వరకు చదివే విద్యార్థుల పూర్తి వివరాలను వార్డుల వారీగా సేకరించి ఎప్పటికప్పుడు అపార్ ఐడీ యాప్‌లో నమోదు చేయాలన్నారు. ఈ విషయమై వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి డివిజన్ పరిధిలోని కార్యాలయం వద్ద వార్డు ఆఫీసర్, వాటర్ లైన్‌మన్, పారిశుద్ధ్య విభాగం అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు రాయించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభమై ఆరు నెలలు కావస్తున్నందున ఆస్తిపన్ను, నల్లాబిల్లులు, మున్సిపల్ దుకాణాల అద్దె వసూళ్లపై దృష్టి పెట్టాలన్నారు. అన్ని వీధుల్లో పారిశుద్ధ్యం ఇంకా మెరుగుపడాలని సూచించారు. అనంతరం మెప్మా పీడీ మహమ్మద్ యూసుఫ్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌తోపాటు దేవరకద్ర మున్సిపాలిటీల పరిధిలో కొత్త మహిళా సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఏఎంసీ అజ్మీరా రాజన్న, మేనేజర్ వెంకటేశ్వరరావు, ఇన్‌చార్జ్ ఎంఈ నర్సింహ, డీఈఈలు హేమలత, విజయ్‌కుమార్, ఆర్‌ఓలు మహమ్మద్ ఖాజా, యాదయ్య, ఆర్‌ఐలు నర్సింహ, రమేష్, అహ్మద్‌షరీఫ్, ముజీబుద్దీన్, ఇన్‌చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.