
ఇటువైపు చూడట్లే..
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించింది. అయితే ప్రత్యేకాధికారులు అసలు పల్లె ముఖం చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాలను విధిగా సందర్శిస్తూ పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా పర్యవేక్షించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. పంచాయతీ కార్యదర్శులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ సమస్యలు పరిష్కరించాల్సి ఉండగా తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పంచాయతీల పాలన పూర్తిగా గాడితప్పింది. దీంతో ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. ఫలితంగా గ్రామాల్లో పాలకులు లేని స్పష్టంగా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంతకాల కోసమే..
పంచాయతీ పాలకవర్గాల గడువు 2024 జనవరి 31న ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన అనివార్యమైంది. జిల్లాలో మొత్తం 423 పంచాయతీలు ఉండగా.. వివిధ శాఖలకు సంబంధించి 150 మంది గెజిటెడ్ అధికారులను స్పెషల్ అధికారులుగా నియమించారు. ఇందులో ఎంపీడీవోలు, ఎంపీఓలు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ఆర్‌ఐలు, ఎంఈఓలు, పీఆర్‌ఏఈలు, సూపరింటెండెంట్లు, ఎంఏఓలు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు, వాటర్ గ్రిడ్ ఏఈలు ఉన్నారు. కొన్ని మేజర్ పంచాయతీలకు జిల్లాస్థాయి అధికారులను నియమించారు. అయితే ఇందులో ఎవరూ కూడా పంచాయతీల ముఖమే చూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నెలలో కనీసం ఒకటి, రెండుసార్లు సందర్శించిన దాఖలాలు సైతం కూడా లేవు. కలెక్టర్ పర్యటించిన సందర్భంలో, అప్పుడప్పుడు సంతకాల కోసం మాత్రమే గ్రామాలకు వస్తున్నట్లు తెలుస్తోంది.
నంచర్ల నుంచి గువ్వనికుంట తండాకు వెళ్లే
ప్రధాన రోడ్డు పరిస్థితి ఇది..
తెలియని శాఖలకు కేటాయింపు
పల్లె పాలనతో సంబంధం లేని ఇతర శాఖల అధికారులను సైతం గ్రామాలకు ప్రత్యేకాధికారులుగా నియమించారు. గ్రామ పాలనకు సంబంధం లేని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, ఆర్‌అండ్‌బీ, జలవనరుల శాఖ, మున్సిపల్, వ్యవసాయం, వైద్యారోగ్యం, విద్య, ఉద్యాన వన, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులు ఇందులో ఉన్నారు. అనుభవం లేని అధికారులు ఈ బాధ్యతలను నిర్వహించాలంటే కొంత సవాలేనని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2018లో పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేశాక పంచాయతీల బాధ్యతలు మరింతగా పెరిగాయి. దీని ప్రకారం ప్రజలకు మెరుగైన పాలన అందాలంటే క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీని సందర్శించి రోజువారీ పనులను పర్యవేక్షించాలి. అలాంటప్పుడు మాతృశాఖలో విధులు నిర్వహించడం ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
సమన్వయం చేస్తున్నాం..
పంచాయతీలను సందర్శించి సమస్యలను పరిష్కరించేలా చూడాల్సిన బాధ్యత ప్రత్యేకాధికారులపై ఉంటుంది. వారు సందర్శించడం లేదనే విషయం మా దృష్టికి రాలేదు. గ్రామ పంచాయతీలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లను సమన్వయం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చాం. – పార్థసారధి, డీపీఓ
గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువు
పల్లెల్లో పడకేసిన అభివృద్ధి, పారిశుద్ధ్యం
వారి మాతృ శాఖ విధుల్లోనే తలమునకలు
సమస్యలు ఎవరికి చెప్పుకోవాలోతెలియక సతమతం
గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తున్నపాలకులు లేని లోటు
324

ఇటువైపు చూడట్లే..