
ఆసియాలోనే మొదటిది..
ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అంటే.. ప్రాజెక్టులోని నీరు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోగానే సైఫన్లు వాటంతట అవే తెరుచుకుంటాయి. అప్పట్లో ఈ టెక్నాలజీతో నిర్మించిన ఆసియాలోనే మొదటి ప్రాజెక్టుకు కాగా.. ప్రపంచంలో రెండోది. 17 వుడ్ సైఫన్లు, 4 ప్రీమింగ్ సైఫన్లతో 391 అడుగుల వెడల్పుతో మెయిన్ సైఫన్ నిర్మించారు. ఒక్కో సైఫన్ 520 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. మట్టికట్ట పొడువు 3,537 అడుగులు, రాతికట్ట పొడవు 520 అడుగులు, కట్ట గరిష్ట ఎత్తు 45.2 అడుగులు, నీటి విస్తరణ ప్రదేశం రెండు చదరపు మైళ్లు, కుడికాల్వ 8 కి.మీ., ఎడమ కాల్వ 20 కి.మీ.,లు ప్రవహిస్తూ ఆయకట్టుకు నీరందిస్తున్నాయి. అయితే ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన కట్ట ఇప్పటి రెండుసార్లు తెగిపోయింది. 1964లో మొదటిసారి, 2019 డిసెంబర్ 31న రెండోసారి కట్టకు గండిపడింది.
వనపర్తి సంస్థానాధీశుల కాలంలో ఏడున్నర దశాబ్దాల క్రితం అమెరికాలోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ప్రాజెక్టు సరళాసాగర్. మదనాపురం మండలం శంకరమ్మపేట సమీపంలోని దీన్ని నిర్మించారు. దేశ స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ ప్రాజెక్టు నిర్మించాలనే ఆలోచన అప్పటి వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్‌రావుకు వచ్చింది. తన తల్లి సరళాదేవి పేరుపై ఏదైనా ప్రత్యేకతతో దీన్ని నిర్మించాలనే ఆలోచనతో ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆటోమేటిక్ సైఫన్ సిస్టం అనే టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చారు. అనధికారికంగా 1947 జూలై 10న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా.. స్వాతంత్య్రం అనంతరం అప్పటి మిలటరీ గవర్నర్ జేఎన్ చౌదరి 1949 సెప్టెంబర్ 15న తిరిగి శంకుస్థాపన చేశారు. పదేళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. అప్పట్లో రూ.35 లక్షలతో పూర్తి చేసిన ఈ ప్రాజెక్టును 1959 జూలై 26న అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి జేవీ రంగారావు ప్రారంభించారు. వర్షం నీరు ఊకచెట్టువాగులో నుంచి వృథాగా కృష్ణానదిలో కలిసిపోవడం, ఈ వాగు సమీపంలోని గ్రామాలను తరుచూ వరద ముంపునకు గురికావడంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు సరళాసాగర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. వనపర్తి సంస్థానం ఆధీనంలోని పది గ్రామాల్లోని సుమారు 4,182 ఎకరాలకు సాగునీరందించేలా 0.5 టీఎంసీ సామర్థ్యంతో సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించారు.
సరళాసాగర్ ప్రాజెక్టు నిర్మించేందుకు అమెరికా వెళ్లి టెక్నాలజీని తీసుకువచ్చిన ప్రాజెక్టు రూపకర్త ఎస్‌ఈ పీఎస్ రామకృష్ణరాజు (ఫైల్)