
లక్ష ఎకరాలకు
రిలే దీక్షలను విరమింపజేసిన మంత్రి
● సీఎం రేవంత్‌రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం
● ఎకరాకు రూ. 20లక్షల పరిహారం పెంపు చారిత్రాత్మక నిర్ణయం
● విలేకర్ల సమావేశంలో
రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ
మంత్రి వాకిటి శ్రీహరి
సాగునీరు అందించడమే లక్ష్యం
నారాయణపేట: పేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం నారాయణపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014లో జీఓ 69 తీసుకొచ్చేందుకు కృషిచేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. నేడు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారని అన్నారు. అందులో భాగంగా భూనిర్వాసితుల ఆకాంక్ష మేరకు రూ.20 లక్షలకు పరిహారం పెంచినట్లు వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్న చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ రిజార్వాయర్‌తో పాటు జాయమ్మ చెరువుతో రైతాంగానికి సాగునీరు అందించేందుకు కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలు, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ప్రాజెక్టు మూలన పడిందన్నారు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. చిట్టెం నర్సిరెడ్డి మనుమరాలు డా.చిట్టెం పర్ణికారెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే కావడం.. కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన రేవంత్‌రెడ్డి సీఎం కావడంతోనే ఈ ప్రాజెక్టు సాధ్యమవుతుందన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని నేరడగాం, భూత్పూర్, సంగంబండ, అనుగొండ, జూరాల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతుల బాధ తనకు తెలుసన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్ష మేరకు పేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి తీరుతామన్నారు. ఈ ప్రాంతంలో ఏళ్లుగా సాగు, తాగునీరు లేక జనం గోస పడుతున్నారన్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను ఎల్లూరు నుంచి మహబూబ్‌నగర్, దేవరకద్ర, మన్యంకొండ మీదుగా మరికల్ వరకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి మక్తల్, నారాయణపేటకు తాగునీరు అందిస్తున్నారన్నారు.
భూ పరిహారం పెంచి తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు వద్ద భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను మంత్రి వాకిటి శ్రీహరి విరమింపజేశారు. అనంతరం సీవీఆర్ భవన్‌కు చేరుకొని మంత్రి వాకిటి శ్రీహరి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డికి స్వీట్లు తినిపించి సంతోషం పంచుకున్నారు.