
మళ్లీ చిరుత కలకలం
● కోస్గిరోడ్డులోని టీడీగుట్ట గుండుపైసంచారం
● చిరుతను బంధించేందుకు రెండు బోన్లు ఏర్పాటు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఇటీవల మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న చిరుత బుధవారం సాయంత్రం మళ్లీ కనిపించింది. తిర్మల్‌దేవుని గుట్టపై కోస్గిరోడ్ సమీపంలోని గుండుమీద చిరుత సంచరిస్తూ కనిపించడం కలకలం రేపింది. గుండుపై చిరుత సంచరిస్తూ కనిపించిన వీడియోలు వైరల్ కావడంతో స్థానికుల సమాచారం మేరకు చిరుత సంచరిస్తున్న స్థలానికి చేరుకున్న మున్సిపల్, అటవీశాఖ అధికారులు డ్రోన్ కెమెరాలో చిత్రీకరిస్తూ అది వెళ్లేదారిని గమనించారు. అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్‌హాయ్ ఆధ్వర్యంలో అటవీశాఖ, మున్సిపల్ సిబ్బంది చిరుతను బంధించేందుకు వెంటనే రెండు బోన్లు ఏర్పాటు చేశారు. కాగా చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిరుతను చూసేందుకు ప్రజలు, వాహనాలపై వెళ్తున్న వారు గుమిగూడడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.