
10 లక్షల ఎకరాల్లో పెరిగిన సాగు విస్తీర్ణం..
ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా వానాకాలం సీజన్‌కు సంబంధించి 2014లో 8.50 లక్షల ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగు కాగా.. ప్రస్తుతం 18.50 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. ఈ లెక్కన 11 ఏళ్లలో 10 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో సాగు నీటి వసతి ఇంకా పెరగాల్సి ఉన్నప్పటికీ.. విస్తారంగా వర్షాలు కురవడం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం ఇస్తుండడం, రుణమాఫీ వంటి చర్యలు ఉమ్మడి జిల్లాలో సాగు గణనీయంగా పెరిగేందుకు దోహదపడ్డాయని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సాగు పెరిగింది..పంట మార్పిడి చేయాలి
పంటల సాగు గణనీయంగా పెరిగింది. ఏటేటా వరి, పత్తినే అధికంగా పండిస్తున్నారు. ప్రతిసారి ఒకే రకమైన పంటలను సాగు చేయడం వల్ల భూమి చౌడు పొలంగా మారుతుంది. అన్ని రకాల పంటలు సాగు చేస్తేనే లాభదాయకంగా ఉంటుంది. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ సీజన్‌లో మొక్కజొన్న సాగు పెరిగింది. పంట మార్పిడి చేసి కందులు, జొన్న, ఆముదం, ఇతర పంటలు కూడా సాగు చేస్తే.. భూసారం దెబ్బ తినదు.
– బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, మహబూబ్‌నగర్
●