
బహిరంగ వేలం వాయిదా
● సిండికేట్ అవుతున్న టెండర్ దారులు
● ఇప్పటికే మూడుసార్లు వాయిదా
చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయం వద్ద బుధవారం కొబ్బరికాయలు, పూలు, పూలదండలు, పూజ సామగ్రి, వాహనపూజ సామగ్రికి నిర్వహించిన బహిరంగ వేలం మళ్లీ వాయిదా పడింది. వేలంలో టార్గెట్ రానందున అధికారులు వాయిదా వేశారు. వేలం పాటలు ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడ్డాయి. మార్కెట్‌లో కొబ్బరి కాయల రేట్లు పెరిగినందున ఆలయ సిబ్బంది నిర్ణయించిన రేటుకు గిట్టుబాటు కాదన్న ఉద్దేశంతో పాట దారులు సిండికేట్ అవుతున్నారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరం టెంకాయ రూ. 25కు విక్రయించగా ఈ సంవత్సరం రూ.30కు విక్రయించేందుకు అధికారులు ధర నిర్ణయించారు. అయినప్పటికీ గిట్టుబాటు కాదని టెండర్ దారులు వేలంలో పాల్గొంటూనే హెచ్చు పాట పాడకుండ అడ్డు వేస్తున్నారు. దీంతో అధికారులు వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఇట్టి విషయంపై ఈఓ మదనేశ్వరెడ్డిని వివరణ కోరగా.. కొబ్బరికాయల విక్రయాల ధర గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రూ.5 పెంచామన్నారు. కానీ టెంటర్ దారులు రూ.35 కావాలని కోరుతున్నట్లు సమాచారం ఉందన్నారు. ఉన్నతాధికారులు నిర్ణయం మేరకు త్వరలో వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, కమిటీ సభ్యులు భారతి, నాగరాజు, కమలాకర్, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.