
ప్రజాస్వామిక పోరాటాలకు ఐలమ్మ స్ఫూర్తి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ‘భూమి కోసం భుక్తి కోసం నా పోరాటం’ అని చాటిచెప్పిన వీరవనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ విజయేందిర అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం జిల్లాకేంద్రంలోని పద్మావతి కాలనీలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాటి తెలంగా సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహాసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ఐలమ్మ ఏ ఒక్క కులం కోసమో, వర్గం కోసమో పోరాటం చేయలేదని, పీడిత, పేద వర్గాల కోసం కొట్లాడిన ధీర వనిత అని కొనియాడారు. ఆనాటి దొరల అరాచకాలను ఎదురించి కొల్లాడిన మహా నాయకురాలని చెప్పారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వముందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, బీసీ సంక్షేమాధికారి ఇందిర తదితరులు పాల్గొన్నారు.