పాలమూరుకు మరో మణిహారం! | - | Sakshi
Sakshi News home page

పాలమూరుకు మరో మణిహారం!

Sep 9 2025 12:40 PM | Updated on Sep 9 2025 12:40 PM

పాలమూ

పాలమూరుకు మరో మణిహారం!

జడ్చర్ల: పాలమూరు జిల్లాకు మరో మణిహారం దక్కనుంది. ఇప్పటికే హైదరాబాద్‌ చుట్టూ నిర్మించిన ఔటర్‌ రింగ్‌రోడ్డు తరహాలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో చేపట్టనున్న ఆర్‌ఆర్‌ఆర్‌ (రీజినల్‌ రింగ్‌రోడ్డు) పరిధిలోకి ఉమ్మడి జిల్లా గ్రామాలు కూడా వెళ్లనున్నాయి. బాలానగర్‌ మీదుగా ట్రిపుల్‌ ఆర్‌ రోడ్డు విస్తరణ పనులు సాగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదిత నోటిఫికేషన్‌ను హెచ్‌ఎండీఏ ఇప్పటికే జారీ.. ఈ నెల 15వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువిచ్చింది. రీజనల్‌ రింగ్‌రోడ్డు వంద మీటర్ల వెడల్పుతో ప్రతిపాదిత అలైన్‌మెంట్‌ కోసం మహబూబ్‌నగర్‌ జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్‌, నల్లగొండ, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌, యాదాద్రి జిల్లాలో పరిధిలోని 33 మండలాలు, 163 రెవెన్యూ గ్రామ పంచాయతీలను కలుపుతూ హెచ్‌ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ అలైన్‌మెంట్‌కు సంబంధించి ఇప్పటికే డిజిటల్‌ మ్యాప్‌లతో పాటు సర్వే నంబర్లు తదితర పూర్తి వివరాలను హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందబాటులో ఉంచారు. ప్రజలు, సంస్థలు తమ అభ్యంతరాలను, సూచనలను రాత పూర్వకంగా సమర్పించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన తర్వాత హెచ్‌ఎండీఏ తుది నోటిఫికేషన్‌ను విడుదలచేయనుంది.

● ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని ఆమన్‌గల్‌, మాడ్గుల, కేశంపేట, తలకొండపల్లి, ఫరూఖ్‌నగర్‌, కొందుర్గు మండలాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ విస్తరించనుంది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం మహబూబ్‌నగర్‌ జిల్లా బాలాగనర్‌ మండలంలోని అప్పాజీపల్లి, బోడజానంపేట, చిన్నరేవల్లి, గౌతాపూర్‌, గుండేడు, మాచారం, పెద్దరేవల్లి, పెద్దాయపల్లి, సూరారం, ఉడిత్యాల్‌, వనమోనిగూడలు ట్రిపుల్‌ ఆర్‌ పరిధిలోకి వెళ్లనున్నాయి. గతంలో ఫరూఖ్‌నగర్‌ మండలం బూర్గుల గ్రామం వరకే ట్రిపుల్‌ ఆర్‌ను పరిమితం చేశారు. డిజైన్‌ మార్పుతో బాలానగర్‌ మండలంలోని కొన్ని గ్రామాలను కలిపి పెద్దాయపల్లి క్రాస్‌ రోడ్‌ వద్ద 44 వ నంబర్‌ జాతీయ రహదారి వరకు ఇది విస్తరించనుంది. దీని నిర్మాణం పూర్తయితే తెలంగాణలోని ఇతర ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, గోవా, కేరళ, రాష్ట్రాలకు రాకపోకలు సాగించే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.

కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం

ట్రిపుల్‌ ఆర్‌ నిర్మాణాన్ని కొందరు ఆమోదిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రహదారి నిర్మాణానికి సేకరించే భూములకు సంబంధించి ఇప్పటికే ఆయా గ్రామాల వారీగా సర్వే నంబర్లను హెచ్‌ఎండీఏ విడుదల చేసింది. భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన పడుతున్నారు. పెద్దాయపల్లి క్రాస్‌రోడ్డు వద్ద 44వ నంబర్‌ జాతీయ రహదారిని అనుసరించి ఏర్పాటయిన వెంచర్లు కూడా ట్రిపుల్‌ ఆర్‌ పరిధిలోకి రావడంతో ఆయా వెంచర్ల నిర్వాహకులు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ మార్కెట్‌ విలువ ప్రకారంగా పరిహారం అందించే పరిస్థితి ఉండడంతో తాము నష్టపోతామని వాపోతున్నారు. కాగా.. ఆర్‌ఆర్‌ఆర్‌ను అనుసరించి ఉన్న భూముల విలువలు అమాంతంగా మూడు–నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉండడంతో ఆయా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల అభివృద్ధికి మహర్దశ పట్టనుందని భావిస్తున్నారు.

న్యాయంగా పరిహారం ఇవ్వాలి

న్నో కష్టాలను అధిగమించి పైసాపైసా కూడగట్టి ప్లాట్లు కొనుగోలు చేశాం. నాతో పాటు ఎంతో మంది ఈ ప్రాంతంలోని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేశారు. ట్రిపుల్‌ ఆర్‌ నేరుగా ఆయా వెంచర్ల గుండా వెళ్తుంది. దీంతో తమ ప్లాట్లకు ప్రభుత్వ లెక్కల ప్రకారం పరిహారం ఇస్తే అన్యాయం జరుగుతుంది. మానవతా దృక్పథంతో మెరుగైన పరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాలి. – ఎస్‌వీ రామారావు, బాలానగర్‌

హర్షణీయం

బాలానగర్‌ సమీపం గుండా ట్రిపుల్‌ ఆర్‌ ఏర్పాటు చేయడం హర్షణీయం. దీంతో వివిధ దూర ప్రాంతాలకు సంబంధించి రాకపోకలు, ఇతర రవాణా సులభతరం అవుతుంది. రవాణా సౌకర్యాలు బలపడితే అది అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది.

– బాదేపల్లి రంజిత్‌బాబు, జడ్చర్ల

ఆర్‌ఆర్‌ఆర్‌ ఏర్పాటుతో మరింత అభివృద్ధి

బాలానగర్‌ మండలం గుండా ట్రిపుల్‌ ఆర్‌ ఏర్పాటు కావడం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే విద్యాసంస్థలు, పరిశ్రమల రాకతో పాటు వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ మాల్స్‌, వాణిజ్య భవనాలు ఏర్పాటవుతాయి. జడ్చర్ల నియోజకవర్గంతో పాటు పాలమూరు జిల్లాకు లాభం చేకూరుతుంది.

– జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్యేల, జడ్చర్ల

ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ

ఈ నెల 15 వరకు అభ్యంతరాలకు గడువు

డిజైన్‌ మార్పుతో ఉమ్మడి జిల్లాలో మరికొన్ని గ్రామాలకు విస్తరణ

జంక్షన్‌గా మారనున్న పెద్దాయపల్లి క్రాస్‌రోడ్‌

పాలమూరుకు మరో మణిహారం! 1
1/1

పాలమూరుకు మరో మణిహారం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement