పేరుకే వన మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

పేరుకే వన మహోత్సవం

Sep 8 2025 7:35 AM | Updated on Sep 8 2025 7:35 AM

పేరుక

పేరుకే వన మహోత్సవం

పట్టణాల్లో నామమాత్రంగా మొక్కల పెంపకం

గడువులోగా లక్ష్యం పూర్తి చేస్తాం

జంగిల్‌ కటింగ్‌ పేరిట హరిత హననం

పర్యావరణ అసమతౌల్యంతో

ఇబ్బందులు

భూత్పూర్‌ రోడ్డులోని పాతపాలమూరు వద్ద గతేడాది నాటిన పెద్ద మొక్కలను ఇటీవల జంగిల్‌ కటింగ్‌ పేరుతో మొదలు వరకు నరికేశారు. పైన విద్యుత్‌ తీగలకు తగులుతాయనే ఉద్దేశంతో వీటిని ఇలా తొలగించారు. నాటినప్పుడు పైన విద్యుత్‌ తీగలు ఉన్నాయనే విషయం తెలిసినప్పటికీ అలాగే గుంతలు తీసి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటి ఆనవాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి.

గరీథ కాలనీకి ఎదురుగా ఉన్న ఓ ఫంక్షన్‌ హాలు వద్ద పచ్చని మొక్కల మధ్య నరికివేసిన పెద్ద చెట్లు ఇలా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా విద్యుత్‌ తీగలకు తగులుతాయని సగానికి సగం నరికేయడం గమనార్హం.

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: జిల్లాలోని మహబూబ్‌నగర్‌ నగరంతో పాటు జడ్చర్ల, భూత్పూర్‌ పట్టణాలలో పేరుకే వన మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వర్షాకాలం సీజన్‌ సగం రోజులు దాటింది. ఒకవైపు మొక్కల పెంపకానికి స్థలాలు గుర్తించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా కిందిస్థాయిలో చలనం లేదు. దీంతో ఈ కార్యక్రమం నామమాత్రంగానే సాగుతోంది. మరోవైపు విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో జంగిల్‌ కటింగ్‌ అంటూ చెట్లను ఎక్కడికక్కడ నరికివేస్తున్నారు. గతంలో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు పెద్దవిగా మారిన తర్వాత వాటిని కొట్టేయడంతో పర్యావరణ అసమతౌల్యం ఏర్పడి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం.

● మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 60 డివిజన్లకు గాను 8 నర్సరీలు ఉన్నాయి. వీటిని కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డు, బండమీదిపల్లి లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, పాల్కొండ బైపాస్‌, భూత్పూర్‌ రోడ్డులోని సాయిబాబా ఆలయం ఎదుట, రూరల్‌ పీఎస్‌ ఎదురుగా బృందావన్‌కాలనీ, ఎదిర, మర్లు, తిరుమల హిల్స్‌లో ఒక్కొక్కటి ఏర్పాటు చేశారు. వీటిలో సుమారు నాలుగు లక్షల మొక్కలు పెంచుతున్నారు. మరో 5.31 లక్షల మొక్కలను అటవీ, డీఆర్‌డీఓ నుంచి సేకరిస్తున్నారు. ఇందులో పూలు, పండ్ల మొక్కలతో పాటు వివిధ రకాలవి ఉన్నాయి. ఇలా ఈసారి 9.31లక్షలు మొక్కలు నాటాలని ఉన్నతాధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. గత జూన్‌ 3న లాంఛనంగా వనమహోత్సవం ప్రారంభించి.. ఇప్పటివరకు కేవలం 50,900 వేల మొక్కలు మాత్రమే పలు చోట్ల నాటారు. ఇక ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున మొత్తం 1.20 లక్షల వరకు పంపిణీ చేయాల్సి ఉన్నా దాని ఊసేలేదు. 2025–26 బడ్జెట్‌లో వనమహోత్సవం కోసం రూ.ఐదు కోట్లకు పైగా కేటాయించారు.

7 చోట్ల స్థలాలను గుర్తించినా..

ఈసారి జిల్లా కేంద్రంలోని ఏనుగొండ నుంచి బైపాస్‌ (భూత్పూర్‌) ఎక్స్‌రోడ్డు వరకు, ఎదిర ఎక్స్‌ రోడ్డు నుంచి దివిటిపల్లి వరకు, కొత్త కలెక్టరేట్‌ నుంచి పోతుగుట్టతండా వరకు, బండమీదిపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల నుంచి గొల్లబండతండా వరకు, మరో మార్గంలోని నర్సాయిపల్లి వరకు, హనుమాన్‌నగర్‌ నుంచి కొత్తచెరువు వరకు, ఎన్‌హెచ్‌–167 రోడ్డు నుంచి మౌలాలిగుట్ట డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వరకు మొక్కలు నాటాలని మున్సిపల్‌ అధికారులు నిర్ణయించారు. అయితే ఆయా ప్రాంతాల్లో గుంతలు తీసి నామమాత్రంగానే నాటారు.

● భూత్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో గోప్లాపూర్‌ వద్ద నర్సరీ ఉంది. ఇందులో పది వేల మొక్కలు పెంచుతున్నామని మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. మరో 23 వేల వరకు అటవీ శాఖ, డీఆర్‌డీఓకు ఇండెంట్‌ పెట్టారు. ఇలా ఈసారి 33 వేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇప్పటివరకు కేవలం పది వేల మొక్కలే నాటారు.

● జడ్చర్ల పట్టణ పరిధిలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ సమీపంలో నర్సరీ ఉంది. ఇందులో సుమారు లక్ష మొక్కలు పెంచుతున్నారు. ఈసారి 2.03 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు కేవలం 50 వేల వరకు మాత్రమే నాటారు. వనమహోత్సవం కోసం ఈ బడ్జెట్‌లో రూ.ఐదు లక్షలు కేటాయించారు.

జిల్లాకేంద్రంలోని టీచర్స్‌ కాలనీలోని ఓ వీధిలో ఏపుగా పెరిగిన చెట్లను ఇలా నరికివేశారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో పలు వీధుల వెంట పదుల సంఖ్యలో మొక్కలు నాటడంతో అవి పెరిగి పెద్దవయ్యాయి. చివరకు విద్యుత్‌ తీగలకు అడ్డం వస్తాయనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ నరికేశారు. దీంతో ఆయా చోట్ల పచ్చదనం కనుమరుగైంది.

నగర పరిధిలో ఇప్పటివరకు 50 వేల పైచిలుకు మొక్కలను గుర్తించిన వివిధ ప్రాంతాలలో నాటాం. ప్రస్తుతం నర్సరీలలో పూలు, పండ్ల మొక్కలు చిన్నవిగా ఉన్నాయి. ఈ నెలాఖరు వరకు వాటిని మొత్తం 60 డివిజన్లలో ఇంటింటికీ పంపిణీ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ వర్షాకాలం సీజన్‌లోగా లక్ష్యాన్ని చేరుకుంటాం.

– టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కమిషనర్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌, మహబూబ్‌నగర్‌

పేరుకే వన మహోత్సవం 1
1/4

పేరుకే వన మహోత్సవం

పేరుకే వన మహోత్సవం 2
2/4

పేరుకే వన మహోత్సవం

పేరుకే వన మహోత్సవం 3
3/4

పేరుకే వన మహోత్సవం

పేరుకే వన మహోత్సవం 4
4/4

పేరుకే వన మహోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement