
యువకుల వీరంగం
రాళ్లు, కర్రలతో దాడి : ముగ్గురికి గాయాలు
గద్వాల క్రైం: మద్యం మత్తులో యువకులు చేసిన వీరంగంతో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం తెల్లవారుజామున గద్వాలలోని అంబేడ్కర్‌నగర్ కాలనీలో చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం మేరకు.. జిల్లాకేంద్రంలోని చింతలపేటకాలనీకి చెందిన రఫీ, నవీన్, నర్సింహ మద్యం కొనుగోలుకు శుక్రవారం రాత్రి హట్కర్‌పేటకాలనీలో ఉన్న బెల్ట్ దుకాణానికి వెళ్లారు. అప్పటికే అంబేడ్కర్‌నగర్‌కాలనీకి చెందిన రంజిత్ సైతం మద్యం కొనుగోలుకు వేచి ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్న యువకులు రంజిత్‌తో అకారణంగా ఘర్షణ పడగా తోటి స్నేహితులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని ముగ్గురు యువకులను మందలించగా గొడవ సద్దుమణిగింది. గొడవ జరిగిన విషయం తెలుసుకున్న ఆ కాలనీ మాజీ తాజా కౌన్సిలర్ మహేశ్ అర్ధరాత్రి 12 గంటల సమయంలో సదరు యువకులను అంబేడ్కర్‌నగర్ వినాయక మండపాం వద్ద గమనించి గొడవకు గల కారణాలు తెలుసుకొని వారిని ఇళ్లకు పంపించారు. శనివారం తెల్లవారుజామున అంబేడ్కర్‌కాలనీ ఎంబీ మిస్పా చర్చి సమీపంలో తాజా మాజీ కౌన్సిలర్ మహేశ్‌ను చూసిన రఫీ, నవీన్, నర్సింహ మరికొందరితో కలిసి రాళ్లు, కర్రలతో దాడి చేయగా కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న మహేశ్ తండ్రి శ్రీనివాసులు, వినయ్ గమనించి అక్కడకు చేరుకొని నిలువారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ దాడిలో మహేష్, శ్రీనివాసులు, వినయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కాలనీవాసులు యువకులను పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకుని పరారయ్యారు. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహేశ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ తాజా మున్సిపల్ చైర్‌పర్సన్ కేశవ్, నాయకులు బాధితులను పరామర్శించారు. బాధితుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ తెలిపారు.

యువకుల వీరంగం