
గల్లంతైన దంపతుల మృతదేహాలు లభ్యం
మల్దకల్: రిజర్వాయర్‌లో పుట్టీ సాయంతో చేపలు పట్టేందుకు వెళ్లిన దంపతులు గల్లంతుకాగా.. గురువారం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. పూర్తి వివరాలిలా.. మల్దకల్ మండలంలోని తాటికుంట రిజర్వాయర్‌లో మంగళవారం సాయంత్రం దంపతులు బోయ దుబ్బోనిబాయి రాముడు, సంధ్య చేపలవేటకు ఎంతకూ తిరిగి ఇంటికి రాకపోవడంతో వారి ఆచూకీ కోసం రెండు రోజుల పాటు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు రిజర్వాయర్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు గురువారం తెల్లవారుజామున దంపతుల మృతదేహాలు నీటిలో తేలుతూ కనిపించడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అఽధికారులకు సమాచారం అందించారు. అనంతరం మల్దకల్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నందీకర్ తెలిపారు.
విద్యుదాఘాతంతో మహిళ మృతి
నవాబుపేట: పంట పొలానికి వేసిన విద్యుత్ కంచె తగిలి మహిళ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని జంగమయ్యపల్లికి చెందిన కంచె కిష్టమ్మ(40) గ్రామ సమీపంలో కుమ్మరి రాములు వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంటకు వేసిన విద్యుత్ కంచె వల్ల షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు కుటుంబ సభ్యులు సమాచారం అందించగా కిష్టమ్మ కుమారుడు నరేష్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్ల్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
తండ్రిపై కుమారుడి దాడి: కారు డిక్కీలో తరలింపు
కల్వకుర్తిటౌన్: వ్యవసాయ పొలం వద్ద ఉన్న కన్నతండ్రిపై కర్రతో దాడిచేసి అక్కడి నుంచి కారులో డిక్కీలో తరలించిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లో వెళ్తే.. పట్టణంలోని వాసవీనగర్‌లో నివాసముంటున్న రైతు బాలయ్య(70) పొలం వద్ద ఉండగా.. బుధవారం సాయంత్రం కుమారుడు బీరయ్య తండ్రిపై కర్రతో దాడిచేసి కారు డిక్కీలో వేసుకొని పరారయ్యాడు. రాత్రివరకు బాలయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా.. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. దీంతో గురువారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. కుమారుడు బీరయ్యనే దాడి చేసి కారులో తీసుకెళ్లినట్లు గుర్తించి అతనికోసం గాలిస్తున్నారు. 24గంటలు గడిచినా వృద్ధుడి ఆచూకీ లభించకపోవడం, దాడికి పాల్పడిన కుమారుడు పరారీలో ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై కల్వకుర్తి సీఐ నాగార్జునను వివరణ కోరగా.. గాయపడ్డ వృద్ధుడిని ఆస్పత్రిలో చేర్పించాడా? లేదా ఏమైనా చేశాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గల్లంతైన దంపతుల మృతదేహాలు లభ్యం