
మధ్యాహ్న భోజనంలో బల్లి కలకలం
● ఆహారం పారబోత.. మళ్లీ వండి విద్యార్థులకు అందజేత
● ఉప్పేరు ఉన్నత పాఠశాలలో ఘటన.. ఎంఈఓ విచారణ
ధరూరు: విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో బల్లి పడిన ఘటన మండలంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ధరూరు మండలంలోని ఉప్పేరు ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం విద్యార్థులకు వంట ఏజెన్సీ వారు రోజులాగే భోజనం సిద్ధంచేసి ప్లేట్లలో వడ్డించారు. అనంతరం విద్యార్థులు చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తుండగా ఓ విద్యార్థి ప్లేట్‌లో బల్లి కనిపించింది. దీంతో వెంటనే విషయాన్ని ఇతర విద్యార్థులకు తెలియజేయడంతో ప్లేట్లలో ఉన్న భోజనాన్ని పారబోశారు. అయితే, చెట్ల కింద కూర్చుని తింటుండగా పైనుంచి బల్లి పడి ఉండవచ్చునని ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ వారు చెబుతుండగా.. విద్యార్థులు కూరలోనే వచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు వైరల్ అయ్యింది. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఎంఈఓ రవీంద్రబాబు గురువారం పాఠశాలకు చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. పిల్లలు చెట్ల కింద కూర్చుని తింటుండగానే చెట్టు పైనుంచి బల్లి పడి ఇలా జరిగిందని ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ మహళలు వివరించారు. ఎవరికీ ఎలాంటి ఆరోగ్య సమస్య తలెత్తలేదని తెలిపినట్లు ఎంఈఓ తెలిపారు. ఇదిలా ఉండగా.. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాష, యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రంగస్వామి తదితరులు పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. వంట ఏజెన్సీ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని, సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రామాంజనేయులు, మనోజ్ కుమార్, గోపాల్, విజయ్ తదితరులు ఎంఈఓకు వినతిపత్రాన్ని అందజేశారు.