
మైసమ్మ ఆలయానికి అటవీ భూమి
నవాబుపేట: జిల్లాలో ప్రసిద్ధిచెందిన పర్వాతాపూర్ మైసమ్మ ఆలయానికి అటవీ భూమి కోసం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ద్వారా ప్రత్యేక ప్రతిపాదన చేసినట్లు మైసమ్మ ఆలయ చైర్మన్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. మైసమ్మ ఆలయానికి అదనంగా 4.0889 హెక్టార్ల (దాదాపు పది ఎకరాలు)అటవీ భూమి కోసం ప్రత్యేక వినతిని జడ్చర్ల ఎమ్మెల్యే ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి కలెక్టర్ అటవీ భూమిలో సంబంధిత అధికారులతో సర్వే చేయించి అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా, కేంద్ర కార్యాలయం తుది అనుమతి రావాల్సి ఉందని.. దీనికి త్వరలోనే అనుమతులు తీసుకొచ్చేలా చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలియజేశారు.
ఆలయ సిబ్బందికి పెరిగిన వేతనాలు
కొన్నేళ్లుగా ఆలయంలో వివిధ రకాల పనులు చేస్తున్న వారికి కనీస వేతనాలు పనికి తగ్గట్లుగా అందేవి కావు. దీంతో వారు చాలా ఏళ్లుగా కనీస వేతనం కోసం జడ్చర్ల ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించడంతో తాజాగా 6 కూలీలకు కనీస వేతనం అందించే జీఓ బుధవారం వచ్చిందని మైసమ్మ ఆలయ చైర్మన్ తెలిపారు. దీంతో గతంలో నెలకు రూ.7500 అందించే వేతనాన్ని రూ.12వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. అలాగే వంశపారంపర్యంగా ఆలయంలో పనులు చేసే మరో వ్యక్తికి సంబంధించి పర్మినెంట్ వేతనం మంజూరు చేస్తూ ప్రభుత్వం గజిట్ ఇచ్చిందని తెలిపారు. దీంతో ఆలయంలో ఉన్న పెండింగ్ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు చైర్మన్‌తోపాటు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
ఆలయ కమిటీ చైర్మన్ జగన్మోహన్‌రెడ్డి