
జూరాలకు తగ్గిన వరద
శ్రీశైలం గేట్లు మూసివేత
దోమలపెంట: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో మంగళవారం సాయంత్రం గేట్లన్నీ మూసివేశారు. సాయంత్రం వరకు మూడు గేట్లు తెరిచి దిగువన నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. జూరాల ఆనకట్ట స్పిల్‌వే నుంచి 69,630, విద్యుదుత్పత్తి చేస్తూ 36,674, సుంకేసుల నుంచి 71,519 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరింది. ప్రస్తుతం జలాశయంలో 881.8 అడుగుల నీటిమట్టం, 197.9120 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడుకు 28,500, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,817, ఎంజీకేఎల్‌ఐకు 417 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భూగర్భ కేంద్రంలో 16.758 మి.యూ., కుడిగట్టు కేంద్రంలో 15.152 మి.యూ. విద్యుదుత్పత్తి చేశారు.
ధరూరు/ఆత్మకూర్/మదనాపురం: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద క్రమంగా తగ్గుముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం 1,56,615 క్యూసెక్కులు ఉండగా... మంగళవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో 1.26 లక్షలకు తగ్గినట్లు చెప్పారు. దీంతో ప్రాజెక్టు 10 క్రస్ట్‌గేట్లను పైకెత్తి 69,630 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. విద్యుదుద్పత్తి నిమిత్తం 36,674 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750, ఆవిరి రూపంలో 67, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 500, భీమా లిఫ్ట్‌కు 750 క్యూసెక్కులు వినియోగించినట్లు చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.048 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు.
కొనసాగుతున్న విద్యుదుత్పత్తి..
జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో మంగళవారం ఉత్పత్తి కొనసాగినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 272.587 మి.యూ, దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 299.688 మి.యూ. విద్యుదుత్పత్తి జరిగిందన్నారు. రెండు కేంద్రాల్లో ఇప్పటి వరకు 572.275 మి.యూ. ఉత్పత్తి చేపట్టినట్లు వివరించారు.
రామన్‌పాడులో 1,020 అడుగులు..
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో మంగళవారం సముద్రమట్టానికి పైన 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా 798 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో సరఫరా లేదన్నారు. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 763 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు చెప్పారు.
10 క్రస్ట్ గేట్లు పైకెత్తి దిగువకు నీటి విడుదల

జూరాలకు తగ్గిన వరద