
కాంగ్రెస్ బాంబు తుస్సుమంది
● కాళేశ్వరం అవినీతిని వెలికితీయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
● కవిత రాజకీయ జిమ్మిక్కులు చేస్తోంది: ఎంపీ డీకే అరుణ
పాలమూరు: అంతా.. ఇంతా అంటూ గొప్పలు చెప్పి ఇప్పుడు చేసేదేమి లేక సీబీఐ విచారణ అంటున్నారని, కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతిని వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఆపార్టీ వ్యవహారం చూస్తుంటే అవినీతికి పాల్పడిన వాళ్లను కాపాడుతున్నట్లు ఉందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు ఆరోపించారు. కాంగ్రెస్ బాంబు పేలలేదని, కాంగ్రెస్ చెప్పే ఏ బాంబు అయినా ఇలాగే తుస్సు మంటుందన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత మొత్తం సొమ్ము కక్కిస్తామని చెప్పిన మాటలు ఎక్కడపోయాయని విమర్శించారు. విచారణ కమిటీ రిపోర్ట్ నివేదికలు అంటూ తాత్సరం చేసి ఇప్పుడు అర్ధరాత్రి వరకు సభ ఏర్పాటు చేసి 20 నెలల తర్వాత సీబీఐ విచారణ అంటున్నారన్నారు. ‘మీరు వేసిన కమిషన్ మీద మీకు నమ్మకం లేదా? మీ మీద మీకు నమ్మకం లేదా..’ అంటూ హేళన చేశారు. ఆ కమిటీ నివేదిక ద్వారా ఏం తేల్చారని, ఎవరిని దోషులుగా చూపారో ఎందుకు బయటపెట్టాలేదని ప్రశ్నించారు. కమిటీ సూచనల ప్రకారం నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. దొంగలు దొంగలు గట్టు పంచుకున్నట్లు, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందు దొందుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో ఎమ్మెల్సీ కవిత డైలాగ్స్ చెబుతోందని, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని స్వయంగా కవిత ఒప్పుకోవడం జరిగిందన్నారు. కానీ ఆ అవినీతిలో కేసీఆర్‌కు సంబంధం లేదంటూ చెప్పడం.. ఇదేక్కడి చోద్యం అన్నారు.ఈ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించింది వాళ్ల కుటుంబమే కదా, కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ కుటుంబసభ్యులు అందరికీ సంబంధం ఉందన్నారు. కవిత రాజకీయ జిమ్మిక్కులు చేస్తోందని, పదేళ్లు వన్‌సైడ్ రాజకీయం చేసిన కేసీఆర్‌కు ఇందులో భాగస్వామ్యం లేదని చెప్పాడం హాస్యాస్పదంగా ఉందన్నారు.