
స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు వెంటనే స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రశాంత్, భరత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.8 వేల కోట్ల వరకు స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. చాలా మంది పేద విద్యార్థులు స్కాలర్‌షిప్‌పై ఆధార పడిచదువుతున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చాలా మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి స్కాలర్‌షిప్‌లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గురుకులాలకు సొంత భవనాలు, కేజీబీవీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ఏఎన్‌ఎం పోస్టులను భర్తీ చేయాలని, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించి, అధ్యాపక, ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీనాథ్, రమేష్, ఈశ్వర్, సాయి, మణికంఠ, హేమలత, జ్ఞాపిక తదితరులు పాల్గొన్నారు.
పట్టపగలే ఇంట్లో చోరీ
ధన్వాడ: మండలంలోని ఎమ్మెనోనిపల్లిలో ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. ఎమ్మెనోనిపల్లికి చెందిన కావలి నర్సింహులు మంగళవారం ఇంటికి తాళంవేసి.. కుటుంబ సభ్యులతో కలిసి ఊట్కూర్‌కు వెళ్లాడు. తిరిగి సాయంత్రం వచ్చి చూడగా.. తలపులు ధ్వంసమై కనిపించాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా.. వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి. ఇంట్లో ఉంచిన రూ. 10లక్షల నగదు, 2 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 10రోజుల క్రితం పొలం విక్రయించగా వచ్చిన సొమ్మును ఇంట్లో పెట్టినట్లు తెలిపారు. కాగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.
ఫోన్ కొనివ్వలేదని..
కృష్ణానదిలో దూకాడు
● యువకుడి ఆత్మహత్యాయత్నం
● ప్రాణాలు కాపాడిన పోలీసులు
కృష్ణా: మొబైల్ ఫోన్ కొనివ్వలేదని కృష్ణానదిలో దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్ర సరిహద్దులో మంగళవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. రాయచూర్ జిల్లా గుంజళ్లి గ్రామానికి చెందిన ఉషెనప్ప(22) కొంత కాలంగా ఫోన్ కొనివ్వడం లేదని తన తల్లితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి మండల పరిధిలోని బ్రిడ్జి వద్దకు చేరుకొని నదిలోకి దూకాడు. స్పందించిన స్థానికులు శక్తినగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని రక్షించి రాయచూర్ రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ విషయమై శక్తినగర్ ఎస్‌ఐ నారాయణను వివరణ కోరగా ఫోన్ ఇప్పించాలని ఇంట్లో తల్లితో గొడవపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. యువకుడికి ఇటీవల వివాహం జరిగినట్లు పేర్కొన్నారు.

స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి