
అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ నుంచి అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపనున్నట్లు డిపో మేనేజర్ సుజాత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సు మహబూబ్‌నగర్ బస్టాండ్ నుంచి వచ్చే నెల 5న రాత్రి 7 గంటలకు బయలుదేరి మార్గమధ్యలో కాణిపాకం విగ్నేశ్వరుడి దర్శనానంతరం వేలూరులోని శ్రీమహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకొని 6న సాయంత్రం 4 గంటలకు అరుణాచలంకు చే రుకుంటుందన్నారు. గిరి ప్రదక్షిణ అనంత రం 7న మధ్యాహ్నం 2 గంటలకు బస్సు బయలుదేరి 8న ఉదయం మహబూబ్‌నగర్‌కు చేరుకుంటుందని చెప్పారు. ఆర్టీసీ అందిస్తున్న టూర్ ప్యాకేజీని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ టూర్ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్‌సైట్ tgsrtcbus.inలో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని, వివరాల కోసం సెల్ నంబర్లు 99592 26286, 94411 62588లను సంప్రదించాలని సూచించారు.
నిమజ్జనంపై ప్రత్యేక నిఘా: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2,447 గణనాథుల మండపాల దగ్గర పోలీస్ భద్రత పటిష్టంగా కొనసాగుతుందని ఎస్పీ జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సురక్ష గణనాథుడి దగ్గర శనివారం అన్నదాన కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించి.. భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అత్యధికంగా 300 విగ్రహాలు ఏర్పాటు చేశారని, మిడ్జిల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 88 రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇలా అన్ని మండపాలకు జియో ట్యాగింగ్ పూర్తి చేసి నిమజ్జనం రూట్‌మ్యాప్, సీసీ కెమెరాల పర్యవేక్షణ, 24గంటల కమాండ్ కంట్రోల్ సెంటర్ మానిటరింగ్ కొనసాగుతుందన్నారు. నిమజ్జనం కోసం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతి మండపానికి జియో ట్యాగ్ ఉండటం వల్ల సీసీ కెమెరాలో రూట్ పర్యవేక్షణ చేస్తామన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయరాదని, ఇలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టామని హెచ్చరించారు.
న్యాయమూర్తికి అభినందనలు
పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం న్యాయ శాఖ కార్యదర్శిగా నియమించింది. ఈ సందర్భంగా శనివారం న్యాయమూర్తిని జిల్లా కోర్టులోని ఆయన చాంబర్‌లో జైలు సూపరింటెండెంట్ వెంకటేశం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.