
ఉరి వేసుకొని యువకుడి బలవన్మరణం
లింగాల: మండలంలోని అంబట్‌పల్లికి చెందిన శివరాం (19) ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్నేహితులతో సరదాగా గడిపిన యువకుడు వారి నుంచి వెళ్లి పోయి ఇంటిలోనే ఉరి వేసుకున్నాడు. తల్లిదండ్రులు భారతి, నిరంజన్ హైదరాబాద్‌లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మృతుడు చదువు మధ్యలోనే మానేసి ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
వివాహిత
అనుమానాస్పద మృతి
కొల్లాపూర్ రూరల్: మండలంలోని ఎల్లూరులో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన తలారి రాముడితో జటప్రోల్‌కు చెందిన దేవమ్మ (35)కు ఏళ్ల కిందటే వివాహం జరిగింది. కాగా రాముడు అదే గ్రామంలో ఉండే తమ సమీప బంధువు అయిన సంధ్యారాణితో ప్రేమాయణం సాగించగా ఆమె గర్భం దాల్చింది. దీంతో యువతి తల్లిదండ్రులు అతడికే ఇచ్చి రెండో వివాహం జరిపించారు. తర్వాత దేవమ్మ బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లిన కొన్నాళ్లకు సంధ్యారాణి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 4న పుట్టినరోజు వేడుకకు రాముడు హైదరాబాద్‌లో ఉంటున్న పెద్ద భార్య దేవమ్మను గ్రామానికి తీసుకొచ్చాడు. పుట్టిన రోజు జరిగిన పెద్ద భార్య, భర్త గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన దేవమ్మ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సోదరి మృతిపై అనుమానం ఉందని, భర్త రాముడు గొంతు నులిపి హత్య చేసి ఉంటాడని దేవమ్మ సోదరులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అనారోగ్య సమస్యలతో
మహిళ ఆత్మహత్య
గద్వాల క్రైం: అనారోగ్య సమస్యలకు తాళలేక ఓ మహిళ ఉరేసుకుని మృతి చెందిన ఘటన గద్వాల పట్టణంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ రెండో ఎస్‌ఐ సతీష్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాలిలా.. గద్వాల దౌదర్‌పల్లి కాలనీకి చెందిన మహాలక్ష్మీ(30) ఏడాది నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంది. కుటుంబ సభ్యులు వైద్యులకు చూయించినప్పటికి సమస్య నయం కాలేదు. దీంతో మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు అర్ధరాత్రి చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. బుధవారం ఉదయం మృతురాలి తండ్రి రంగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
పెద్దకొత్తపల్లి: మండలంలోని గంట్రావుపల్లికి చెందిన కదిర మౌనిక (18) మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. స్థానికుల వివరాల మేరకు.. గంట్రావుపల్లికి చెందిన రాములు – అనిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు మౌనిక లింగాల గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివేది. అయితే మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తూ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసి, యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు.
చికిత్స పొందుతూ
వృద్ధురాలు మృతి
హన్వాడ: మండలంలోని టంకర గ్రామానికి చెందిన తాటికొండ పెంటమ్మ(60) వృద్ధురాలు చికిత్స పొందుతూ బుధవారం మృత్యువాత పడినట్లునట్లు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన పెంటమ్మ గత నెల 5వ తేదీన ఇంటి పక్కనే ఉన్న శివలీల ఇంటికి వెళ్లింది. ఈక్రమంలో గారెలు చేస్తున్న శివలీల అకస్మాత్తుగా నూనె బాండిలో మంటలు రేగడంతో నూనెను బయట పారబోసేందుకు బాండిని బయటికి తీసుకెళ్లింది. అదే ఇంట్లో హాలులోనే కూర్చున్న పెంటమ్మపై నూనెబాండి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం మొదట జిల్లా ఆసుపత్రికి, తర్వాత హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. పెంటమ్మ పరిస్థితి విషమించడంతో మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు మృతురాలి కుమారుడు తాటికొండ శ్రీనివాసులు పిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు.

ఉరి వేసుకొని యువకుడి బలవన్మరణం