
కోర్టు భవనాన్ని త్వరగా సిద్ధం చేయండి
దేవరకద్ర: స్థానికంగా త్వరలో కోర్టును ప్రారంభించాల్సి ఉందని.. పనులు త్వరగా పూర్తి చేసి కోర్టు భవనాన్ని సిద్ధం చేయాలని జిల్లా జడ్జి పాపిరెడ్డి సూచించారు. బుధవారం దేవరకద్రలోని పాత మండల పరిషత్ భవనాన్ని, పరిసరాలను, గదులను ఆయన పరిశీలించారు. భవనాన్ని మరమ్మతులు చేసి రంగులు వేయాలని, కావాల్సిన ఫర్నిచర్‌ను ఏర్పాటు చేస్తే వెంటనే కోర్టును ప్రారంభిస్తామని జడ్జి తెలిపారు. పనులు ఎంత త్వరగా పూర్తి చేస్తే కోర్టు ప్రారంభం అవుతుందని ఇప్పటికే ఆలస్యమైందన్నారు. అధికారులు, కాంట్రాక్టర్ వెంటనే పనులు చేపట్టాలని సూచించారు. ఈ ప్రాంతానికి కోర్టు రావడం వల్ల చుట్టు పక్కల మండలాలకు సంబంధించిన కేసులను సత్వరం పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆయన వెంట జడ్జి కల్యాణ్ చక్రవర్తి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, న్యాయవాదులు ఉన్నారు.