
11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుదుత్పత్తి
ఆత్మకూర్/ధరూరు/రాజోళి: జూరాల ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బుధవారం విద్యుదుత్పత్తి కొనసాగింది. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, 197.568 ఎం.యూ., దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 234.576 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటి వరకు 432.144 ఎం.యూ. విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామని పేర్కొన్నారు. కాగా, జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గుముఖం పట్టింది. మంగళవారం రాత్రి 8 గంటల వరకు 29,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. బుధవారం సాయంత్రం 7 గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో 20వేల క్యూసెక్కులకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 9,811, కోయిల్‌సాగర్‌కు 315, నెట్టెంపాడుకు 750, ఆవిరి రూపంలో 70, ఎడమ కాల్వకు 1,080, కుడి కాల్వకు 670, సమాంతర కాల్వకు 700, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులతో కలిపి మొత్తం 13,394 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 8.750 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
● సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి 16వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. నాలుగు గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 17,784 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు జేఈ మహేంద్ర తెలిపారు. కేసీ కెనాల్‌కు 2,012 క్యూసెక్కుల నీరు వదిలినట్లు పేర్కొన్నారు.