
జోరుగా ఉల్లి వ్యాపారం
దేవరకద్ర: పట్టణంలోని మార్కెట్‌యార్డులో బుధవారం ఉల్లి ఽవ్యాపారం జోరుగా సాగింది. వర్షం లేకపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి రైతులు దాదాపు 500 బస్తాల ఉల్లిని విక్రయానికి తీసుకొచ్చారు. మార్కెట్ వ్యాపారులతో పాటు బయటి నుంచి వచ్చిన వ్యాపారులు ఉల్లి వేలంలో పాల్గొని కొనుగోలు చేశారు. క్వింటాల్ గరిష్టంగా రూ. 1,800, కనిష్టంగా రూ. 900 వరకు ధరలు వచ్చాయి. 50కిలోల ఉల్లి బస్తాను గరిష్టంగా రూ. 900, కనిష్టంగా రూ. 500 వరకు విక్రయించారు. ఉల్లి విక్రయాలతో వ్యాపారులు, రైతులు, వినియోగదారులతో మార్కెట్ సందడిగా కనిపించింది.
గంజాయి పట్టివేత
ఖిల్లాఘనపురం: గంజాయి నిల్వ చేసిన ఓ వ్యక్తిని పట్టుకొని కేసునమోదు చేసిన ఘటన మండలంలోని దొంతికుంటతండాలో మంగళవారం చోటు చేసుకోగా బుధవారం వెలుగు చూసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల కథనం మేరకు.. తండాకు చెందిన పాత్లావత్ లాలూ గంజాయి నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు మహబూబ్‌నగర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ శారద, సబ్ ఇన్‌స్పెక్టర్ దేవులపల్లి కృష్ణ సిబ్బందితో కలిసి మంగళవారం నిఘా ఉంచారు. స్టేజీ నుంచి తండాకు కారులో వెళ్తున్న లాలూను పట్టుకొని తనిఖీ చేయగా 180 గ్రాముల గంజాయి లభ్యమైంది. కేసునమోదు చేసి సదరు వ్యక్తిని బుధవారం కోర్టులో హాజరుపర్చినట్లు వారు వివరించారు.
గుర్తుతెలియని మృతదేహంలభ్యం
పెద్దకొత్తపల్లి: కల్వకోలు గ్రామ శివారులో గల సింగోటం చెరువులో 45 ఏళ్ల వయస్సు గల పురుషుడి శవం లభించినట్లు ఎస్‌ఐ సతీష్ బుధవారం తెలిపారు. శవం పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా కుళ్లి పోయిందని, శవంపై బూడిద రంగు చొక్కా, నైట్ ప్యాంట్‌తో పాటు కుడిచేతికి రాగి కడియం, ఎడమ కాలికి నల్లటి దారం ఉందని ఎస్‌ఐ తెలిపారు. శవాన్ని గుర్తుపట్టిన వారు 87126 57721, 87126 57718 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
వట్టెం రిజర్వాయర్‌లో
మృతదేహం లభ్యం
బిజినేపల్లి: వట్టెం రిజర్వాయర్‌లో బుధవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టెం రిజర్వాయర్‌లోని నీటి గుంతల్లో ఒక మృతదేహాం పూర్తిగా కుళ్లిపోయి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చామన్నారు. కనీసం మృతదేహాం వయస్సును కూడా గుర్తించడానికి వీలు లేకుండా ఉందని తెలిపారు.

జోరుగా ఉల్లి వ్యాపారం