
‘కాళేశ్వరం’ పై వాస్తవాలు వెల్లడించాలి
జడ్చర్ల: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వెల్లువెత్తిన ఆరోపణలపై అసెంబ్లీ వేదికగా వాస్తవాలు వెల్లడించాలని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలో రెండ్రోజులుగా కొనసాగుతున్న పార్టీ 23వ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బుధవారం జరిగిన సమావేశం, అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని.. మాజీ సీఎం కేసీఆర్ హాజరై చర్చలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద దివంగత సీఎం వైఎస్‌ఆర్ చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్‌ను గత ప్రభుత్వం విస్మరించిందని, పనులు పెండింగ్ పెట్టడంతో వెచ్చించిన నిధులు వృథా అయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు జాతీయహోదా కల్పించాలని తాము తెలంగాణ ఉద్యమంతో పాటు పోరాటం చేశామని గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైందని.. సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని, కేంద్రం పచ్చజెండా ఉపాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణాపై వివక్ష చూపుతోందని.. ఏపీలో పోలవరంకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లకు ఆ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ,గ్రామపంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నారు. అంతరాలు లేని సమసమాజ నిర్మాణమే భారత కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమని తెలిపారు. సమాజంలో డబ్బు, హోదా, కులం, మతం, ప్రాంతం అంటూ అనేక రకాల రూపాల్లో పెరుగుతున్న అంతరాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనర్సింహ, జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఫయాజ్, మాజీ కార్యదర్శి పరమేష్‌గౌడ్, కార్యవర్గ సభ్యులు రాము, అల్వాల్‌రెడ్డి, కృష్ణయాదవ్, గోవర్ధన్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
అంతరాలు లేని సమాజ
నిర్మాణమే లక్ష్యం
సీపీఐ జాతీయ కార్యవర్గ
సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి