
భూ నిర్వాసితులకు త్వరితగతిన పునరావాసం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు త్వరితగతిన పునరావాసం కల్పించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్, మిషన్ భగీరథ తదితర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రిజర్వాయర్ కింద వల్లూరు, ఉదండాపూర్, తుమ్మలకుంటతండా, రేగడిపల్లితండా, చిన్నగుట్టతండా, శామగడ్డతండా, ఒంటిగుడిసెతండా, పోలేపల్లి వ్యవసాయ క్షేత్రంలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు, అవార్డు అందుకున్న వారందరికీ 300 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. పునరావాస కేంద్రంలో ఆరోగ్య ఉపకేంద్రం, ఇంటిగ్రేటెడ్ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలు, వెటర్నరీ హాస్పిటల్, కమ్యూనిటీ హాల్స్, గ్రామపంచాయతీ భవనం, పార్కులు, రోడ్లు డ్రెయినేజీలు, విద్యుత్ సరఫరా, ఓవర్‌హెడ్ ట్యాంకులు, మిషన్ భగీరథ పథకం పైపులైన్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి
జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారుల తో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆ రోజు పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో వేదిక, వీఐపీలు, ఆయా శాఖల అధికారులకు కుర్చీలు ఉండేలా చూడాలన్నారు. అందరికీ తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. ముఖ్య అతిథి సందేశం రూపొందించేందుకు ఆయా శాఖలు సాధించిన ప్రగతి నివేదికలను సీపీఓకు పంపించాలన్నారు. నగరంలోని ముఖ్య కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ దీపాల అలంకరణ చేయాలన్నారు. ఆయా శాఖలు సాధించిన ప్రగతిని తెలుపుతూ శకటాలు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు ఎ.నరసింహారెడ్డి, శివేంద్రప్రతాప్, సీపీఓ రవీందర్, డీఈఓ ప్రవీణ్‌కుమార్, డీఎఫ్‌ఓ సత్యనారాయణ, మహిళా–శిశు సంక్షేమ అధికారిజరీనాబేగం, డీఎస్‌ఓ గంప శ్రీనివాస్, ఆర్‌డీఓ నవీన్, డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయేందిర బోయి