
ప్రశాంతంగా లైసెన్స్‌డ్ సర్వేయర్ ప్రాక్టికల్
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రభుత్వం లైసెన్స్‌డ్ సర్వేయర్ల ఎంపికకు రెండు నెలలుగా శిక్షణ ఇచ్చిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖ సోమవారం ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించింది. మొదటి విడతగా శిక్షణ ఇచ్చిన అభ్యర్థులకు ప్రాక్టికల్ పరీక్షలను పూర్తి చేసింది. లైసెన్స్‌డ్ సర్వేయర్ ఎంపిక కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 230 మంది అభ్యర్థులుండగా వారిని ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది. అందులో మొదటి విడతగా 132 మందికి భూసర్వే నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. రెండు నెలలుగా శిక్షణ పొందిన 98 మంది అభ్యర్థులలో సోమవారం 47 మందికి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించగా.. మిగతా 51 మంది అభ్యర్థులకు మంగళవారం నిర్వహించనున్నారు. పరీక్షల అనంతరం వారి ఫలితాలు వెల్లడించి లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా ఎంపికై న వారికి ధ్రువపత్రాలు అందజేస్తారు. కాగా.. జిల్లాలో గత మే నెలలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా నియమించేందుకు అవసరమైన శిక్షణను జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ అందించారు. చైన్ సర్వే, టోటల్ సర్వే వంటి వాటిపై అవగాహన కల్పిస్తూ హద్దుల గుర్తింపు, సర్వే నంబర్లలోని సబ్‌డివిజన్ సమస్యపై చేపట్టాల్సిన సర్వే వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ ఏడీ కిషన్‌రావు పర్యవేక్షణలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే ఎండీ మూసా, రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారి పర్వతాలు మొదటి బ్యాచ్‌కు రెండు నెలలపాటు క్షేత్రస్థాయి భూ సర్వేపై అభ్యర్థులకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి ఆర్వోఆర్–2025 చట్టం అమలులో వీరి సేవలు వినియోగించనున్నారు.

ప్రశాంతంగా లైసెన్స్‌డ్ సర్వేయర్ ప్రాక్టికల్