బాధితులకు సత్వర న్యాయం అందాలి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు సత్వర న్యాయం అందాలి

Jul 29 2025 4:39 AM | Updated on Jul 29 2025 9:04 AM

బాధిత

బాధితులకు సత్వర న్యాయం అందాలి

మహబూబ్‌నగర్‌ క్రైం: ప్రతి పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టిపెట్టడంతోపాటు వారికి సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 13 మంది బాధితులతో ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ సదరు పోలీస్‌ స్టేషన్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదులు వేగవంతంగా పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి నిత్యం వాటిపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ క్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ వృద్ధురాలు మెట్ల మార్గంలో మొదటి అంతస్తులోకి వెళ్లడానికి ఇబ్బంది పడటంతో ఎస్పీనే కిందకు వచ్చి మహిళతో మాట్లాడి ఫిర్యాదు స్వీకరించారు.

1 నుంచి కార్మికులకు కొత్త పథకం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ)లో కొత్తగా నమోదయ్యే కార్మిక ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ‘ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం’ ప్రవేశపెట్టిందని పీఎఫ్‌ నోడల్‌ ఆఫీసర్‌ శ్రీలతారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక చైతన్య సెంట్రల్‌ స్కూల్‌లో పీఎఫ్‌ ఖాతాదారుల సమస్యలపై ‘నిధి ఆప్కే నిక్కత్‌–2’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే నెల 1 నుంచి కొత్తగా ఉద్యోగాల్లోకి చేరి తొలిసారి ఈపీఎఫ్‌ఓలో పేరు నమోదైన వారికి రూ.15 వేల ప్రోత్సాహకం లభిస్తుందన్నారు. ఇది ఏడాదిలో రెండుసార్లు (ఆరు నెలలకోసారి) నేరుగా ఉద్యోగుల ఖాతాలో డీబీటీ విధానంలో జమ అవుతుందన్నారు. ఈ ప్రయోజనం రూ.లక్ష వరకు వేతనం వచ్చే కొత్త ఉద్యోగులందరికీ వర్తిస్తుందన్నారు. కార్మికులు, ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో పీఎఫ్‌ సెక్షన్‌ సూపర్‌వైజర్‌ శరత్‌, వివిధ కంపెనీల ఉద్యోగులు పాల్గొన్నారు.

కోయిల్‌సాగర్‌లో

26 అడుగుల నీటిమట్టం

దేవరకద్ర: కోయిల్‌సాగర్‌లో నీటిమట్టం సోమవారం సాయంత్రం వరకు 26 అడుగులకు చేరింది. ఈ నెల 1న ప్రాజెక్టులో కేవలం 11 అడుగుల కనిష్ట స్థాయిలో ఉండగా అదేరోజు జూరాల నుంచి కోయిల్‌సాగర్‌ లిఫ్ట్‌ ఫేస్‌–1లో ఒక పంపును రన్‌ చేసి నీటిని విడుదల చేశారు. 6న తీలేరు వద్ద ఉన్న ఫేస్‌–2 పంపుహౌస్‌కు చేరిన నీటిని ఒక పంపును రన్‌ చేసి కోయిల్‌సాగర్‌కు విడుదల చేశారు. గత 22 రోజుల నుంచి ఎత్తిపోతల ద్వారా వస్తున్న నీటితోనే ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీనికితోడు ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో పెద్ద వాగు ద్వారా కొంత నీరు కూడా ప్రాజెక్టులోకి చేరుతోంది. కాగా.. ప్రాజెక్టు పాత అలుగు స్థాయి 26.6 అడుగులు కాగా మరో 0.6 అడుగుల నీరు రావాల్సి ఉంది. అలాగే ప్రాజెక్టు గేట్ల స్థాయి 32.6 అడుగులు కాగా మరో 6.6 అడుగుల నీరు వస్తే పూర్తిస్థాయికి చేరుకుంటుంది. ఇదిలా ఉండగా.. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతుంది.

దరఖాస్తుల ఆహ్వానం

బిజినేపల్లి: మండలంలోని వట్టెం జవహర్‌ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ప్రవేశానికి గాను విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పి.భాస్కర్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు నవోదయ వెబ్‌సైట్‌ ద్వారా సెప్టెంబర్‌ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం నవోదయ విద్యాలయం లేదా ఉమ్మడి జిల్లాలోని మండల విద్యాధికారుల కార్యాలయాల్లో సంప్రదించాలని తెలిపారు.

బాధితులకు సత్వర న్యాయం అందాలి 
1
1/1

బాధితులకు సత్వర న్యాయం అందాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement