
బడుల బలోపేతం దిశగా..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచనల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ప్రీప్రైమరీ (పూర్వపు ప్రాథమిక విద్య)ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రైవేటు స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్య అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లు అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటులో చేర్పిస్తున్నారు. తద్వారా అన్ని స్థాయిల్లో ప్రైవేటు స్కూళ్లకు విద్యార్థులు అలవాటు పడుతున్నారు. ఈ లోపాన్ని సరిదిద్ది సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు ప్రభుత్వం పూర్వపు ప్రాథమిక విద్య అందించేందుకు చర్యలు చేపట్టింది. అందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 90 ప్రీ ప్రైమరీ స్కూళ్లను నెలకొల్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభించిన పాఠశాలల్లో 4–5 ఏళ్ల పిల్లలను చేర్చుకోవాలని సూచించింది.
ఇద్దరు చొప్పున నియామకం..
ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాలకు ఇద్దరు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో ఒక టీచర్ ఇంటర్మీడియట్‌తోపాటు ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్, ప్రైమరీ టీచింగ్‌లో అర్హులై ఉండాలి. విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు ఒక ఆయాను కూడా నియమించాల్సి ఉంది. ఆమెకు కనీసం 7వ తరగతి అర్హత ఉండి స్థానికులై ఉండాలి. వీరిని జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఎంపిక చేస్తుంది. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఎస్‌సీఆర్‌టీ జాతీయ స్థాయిలో అమలుపరుస్తున్న సిలబస్‌ను బోధించాల్సి ఉంటుంది.
ప్రైమరీ పాఠశాలల్లో..
నూతనంగా ప్రారంభించే ప్రీ ప్రైమరీ స్కూళ్లకు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైమరీ పాఠశాలల్లో ఒక తరగతి గదిని కేటాయించనున్నారు. అనంతరం అందుబాటులో ఉండే నిధుల ఆధారంగా కొత్త గదులను నిర్మించనున్నారు. వీటిలో వసతుల కల్పన కోసం ఒక్కో బడికి రూ.1.50 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో విద్యార్థులు ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్ ఆడేందుకు బొమ్మలు, గోడలపై ఆకర్షణీయమైన చిత్రాలు వేయడం, బేంచీలు, బోర్డులు, కుర్చీల వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటి కొనుగోలు పూర్తిగా కలెక్టర్ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టాలి. వీటితోపాటు అన్ని పాఠశాలల మాదిరిగానే మధ్యాహ్న భోజనం, స్నాక్స్ వంటివి విద్యార్థులకు అందిస్తారు.
ఏయే పాఠశాలల్లో అంటే..
ఎంపీపీఎస్ బాదేపల్లి తెలుగువాడ, బోడజానంపేట, బాదేపల్లి (బీఓ), కన్మనూర్, కొత్తూర్, ఎల్లంబాయితండా, గురుకుంట, వెంకట్‌రెడ్డిపల్లి, కాటవరం, జంగమయ్యపల్లి, రావులపల్లి, బాదేపల్లి (కొత్తబజార్), రెడ్డిపల్లి, వాడ్యాల్, పెద్దతండా, కొల్లంపల్లి, ధర్మాపూర్, సింగనోనిపల్లి, గొల్లబండతండా, చౌదర్‌పల్లితండా, సింగాయపల్లి, చౌదర్‌పల్లి, బల్సుర్‌గొండ, మున్ననూర్, చెడుగుట్ట, మణికొండలో ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు.
ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు
ఉమ్మడి జిల్లాలో కొత్తగా ప్రారంభం కానున్న 90 పాఠశాలలు
వసతుల కల్పనకు రూ.1.50 లక్షల చొప్పున మంజూరు
ఈసారి నుంచే ఎల్‌కేజీ,
యూకేజీ అడ్మిషన్లకు అనుమతి
జాతీయ స్థాయి సిలబస్
బోధనకు చర్యలు