
ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మండలాల ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పీహెచ్‌సీ, హెల్త్ సబ్‌సెంటర్లు సందర్శించి ఏమైనా సమస్యలు, లోపాలు ఉంటే గుర్తించాలన్నారు. మహమ్మదాబాద్ పీహెచ్‌సీలో షార్ట్‌సర్క్యూట్ సమస్య పరిష్కరించాలని చెప్పారు. అన్ని పీహెచ్‌సీల్లో లేబర్ రూంలు వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. జ్వరాలు ప్రబలిన గ్రామాలను వైద్యాధికారులు సందర్శించి.. అవసరమైన వైద్యసహాయం అందించాలని చెప్పారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. మండలంలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామని, వర్షాలు, వరదలు వలన విపత్తు సంభవించకుండా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే యూరియా, ఎరువులు స్టాక్, రైతులకు సరఫరాపై నిత్యం సమీక్షించాలని సూచించారు. యూరియా పంటల సాగుకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లించకుండా దృష్టిసారించాలన్నారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలోని ఎస్సీ, బీసీ బాలికల వసతి గృహంలో తాగునీరు, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాల వలన వరద నీరు పొంగి ప్రవహించే కాజ్‌వేలను గుర్తించి ట్రాఫిక్ మళ్లించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆస్పత్రులు శిథిల భవనాల్లో నిర్వహించవద్దన్నారు. డీఆర్‌డీఓ నర్సింహులు మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పటికే 27 లక్షల గుంతలు తీసి.. 21 లక్షల మొక్కలు నాటామని, ఆగస్టు మొదటి వారంలోగా మరో 8 లక్షల మొక్కలు నాటుతామని పేర్కొన్నారు. అలాగే 8 లక్షల మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేశామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సిటిజన్ ఫీడ్ బ్యాక్ కింద మొబైల్ యాప్‌లో ఫీడ్ బ్యాక్ ఆగస్టు 31లోగా పూర్తిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, ఆర్డీఓ నవీన్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, నర్సింహారెడ్డి, ఆర్డీఓ నవీన్, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.