
బీజేపీలో రగడ!
నేతల మధ్య రచ్చకెక్కినఅంతర్గత పోరు
● రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలోనేబహిర్గతం
● చిచ్చురేపిన డీకే మాటలు.. మనస్తాపానికి గురైన శాంతికుమార్?
● ఎంపీ అనుచరుల గోబ్యాక్ నినాదాలపై పార్టీలో భిన్నస్వరాలు
● తెరపైకి బీసీ వాదం.. ‘కమలం’ శ్రేణుల్లో అయోమయం
● ‘స్థానిక’ఎన్నికల వేళ నష్టం వాటిల్లుతుందని ఆందోళన
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: క్రమశిక్షణకు పెద్దపీట వేసే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పాలమూరులో ఇటీవల చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు కలకలం సృష్టిస్తున్నాయి. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో బహిరంగ సమావేశం వేదికగా అంతర్గత పోరు రచ్చకెక్కగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శాంతికుమార్ గో బ్యాక్ అంటూ డీకే అనుచరుల నినాదాలు.. వేదికపై ఆయననుద్దేశించి అరుణ పరోక్షంగా మాట్లాడిన మాటలు పార్టీలో చిచ్చు రాజేశాయి. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన శాంతికుమార్ స్తబ్దుగా ఉండగా.. ఆయన అనుచరులు మాత్రం మండిపడుతున్నారు. ఈ క్రమంలో బీసీ వాదం తెరపైకి రాగా.. పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. రానున్న స్థానిక ఎన్నికల వేళ నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్రామ, మండల, పట్టణ స్థాయి నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.