
అటవీ ప్రాంతంలో వ్యక్తి అదృశ్యం
మన్ననూర్: శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారి నల్లమల అటవీ ప్రాంతం సరిహద్దులో వ్యక్తి అదృశ్యమైన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాలిలా.. గురువారం రాత్రి రహదారి గుండా పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో లంబడోని ఉతార్ అనే అటవీ సరిహద్దు ప్రాంతంలో ఒక ఆటో నిలిచి ఉండటాన్ని అటవీ శాఖ అధికారులు గమనించారు. కొంత సమయం వరకు అక్కడే ఉండి పరిశీలించగా ఎంతకు సంబంధిత వ్యక్తులు ఎవరు కూడా రాకపోవడంతో ఆటోను మన్ననూర్ దుర్వాసుల చెరువు వద్ద ఉన్న అటవీశాఖ చెక్‌పోస్టు ప్రాంగణానికి తరలించారు. అయితే, ఆటోలో లభించిన ఆధారాలను బట్టి అదృశ్యమైన వ్యక్తి శ్రీశైలం గ్రామానికి చెందిన ఎం.లక్ష్మణ్‌గా భావించారు. అయితే, శుక్రవారం ఉదయం సదరు వ్యక్తి బంధువులు చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. గత కొంత కాలంగా లక్ష్మణ్ తరచూ ఆందోళన చెందుతూ.. మతిస్థిమితం కోల్పోయినట్లుగా ప్రవర్తించేవాడని, ఈ క్రమంలోనే ఇక్కడికి వచ్చి ఉండవచ్చునని అమ్రాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ గిరి మనోహర్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది అటవీ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అదృశ్యమైన వ్యక్తి ఎవరికై నా కనిపిస్తే సెల్ నం.8985778286కు లేదా అమ్రాబాద్ పోలీస్ స్టేషన్‌లో తెలియజేయాలని కోరారు.
అచ్చంపేటలో
బిహార్ పోలీసులు
అచ్చంపేట రూరల్: సైబర్‌క్రైం నేరారోపణల నేపథ్యంలో శుక్రవారం అచ్చంపేటలో బిహార్ పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్‌ఐ విజయభాస్కర్ కథనం మేరకు.. పట్టణానికి చెందిన వెంకటరమణ ప్రధాన రహదారికి ఎదుట బాలాజీ మెడికల్ దుకాణం నిర్వహిస్తున్నారు. అతడి కుమారుడు డొంగరి అనిరుధ్ ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. బిహార్‌లో రూ.2 కోట్ల వరకు పలువురి అకౌంట్ల నుంచి తండ్రి వెంకటరమణ, నల్గొండ జిల్లా కోదాడకు చెందిన భార్య అకౌంట్లకు మళ్లించడంతో కేసు నమోదైంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపినట్లు ఎస్‌ఐ వివరించారు. గతంలో చైన్నె, బెంగుళూరు పోలీసులు కూడా వచ్చి విచారణ చేపట్టారని తెలిపారు. సుమారు రూ.9 కోట్ల వరకు పలువురు అకౌంట్ల నుంచి డబ్బులు దారి మళ్లినట్లు వివరించారు. బిహార్ డీఎస్పీతో పాటు సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారుల బృందం గాలించినప్పటికీ అనిరుధ్ ఆచూకీ లభించలేదని ఎస్‌ఐ తెలిపారు. మరోసారి సోదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
మద్యం దుకాణంలో చోరీ
వనపర్తి రూరల్: జిల్లా కేంద్రంలోని యుఆర్ లిక్కర్‌మార్ట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని పెబ్బేరు రోడ్డులోని యుఆర్ లిక్కర్ మార్ట్‌ను మూసి సిబ్బంది ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు లిక్కర్ మార్ట్ పైకప్పు కట్ చేసి లోపలికి దిగి రూ.2.08 లక్షల నగదు చోరీ చేశారు. ఘటనపై మార్ట్ క్యాషియర్ జయబ్రహ్మం శుక్రవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

అటవీ ప్రాంతంలో వ్యక్తి అదృశ్యం