
భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్ కింద కేటాయించే స్థలాన్ని అన్ని వసతులలో వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీహాల్‌లో ఆయా శాఖ అధికారులతో సమీక్షించారు. ఉదండాపూర్ తుమ్మలకుంట తండా, రేగడిపట్టి తండా, చిన్నగుట తండా, ఒంటిగుడిసె తండా, పోలేపల్లి వ్యవసాయక్షేత్రంలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసం కింద 300 గజాల స్థలం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
సీజనల్ వ్యాధులను అరికట్టాలి
వర్షాల కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టడంతో పాటు దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా.. తదితర వ్యాధులను అరికట్టేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సంసిద్ధంగా ఉండాలని సూచించారు. దోమల రాకుండా ఫాగింగ్‌చేయాలని, పీహెచ్‌సీల నుంచి ప్రతిరోజూ జ్వరాల నివేదిక సమర్పించాలన్నారు. తాగునీరు పరిశుభ్రంగా ఉండేలా మిషన్ భగీరథ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్లు కీలకం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలని, ఆయా సంక్షేమ ఫలాలు పేదలకు చేరే విధంగా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, లక్ష్మణ్‌కుమార్‌లతో కలిసి ఆయన కలెక్టర్‌తో వీసీ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, భూభారతి, వన మహోత్సవం, మహాలక్షి పథకం తదితర అంశాలపై సమీక్షించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, నర్సింహారెడ్డి, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, ఆర్‌డీఓ నవీన్, డీఎంహెచ్‌ఓ కృష్ణ, డీపీఓ పార్థసాఽరథి, హౌజింగ్ పీడీ వైద్యం భాస్కర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్, సివిల్ సప్లయ్ డీఎం రవినాయక్, తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర కోరారు. ఉరుములు, మెరుపులు, వచ్చిన సమయంలో ట్రాన్స్‌ఫార్మర్లు, సెల్‌టవర్ల వద్ద కు వెళ్లరాదని సూచించారు. చెట్ల కొమ్మలు, తెగినపడిన విద్యుత్ తీగల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు, వంకలు, నీటి ప్రవాహాలు, చెరువుల వద్దకు వెళ్లవద్దని సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశామని, ఎవరికైనా సమస్యలు వస్తే 08542–241165 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.