
మళ్లీ కనిపించిన చిరుత
మహబూబ్‌నగర్ న్యూటౌన్: పాలమూరు పట్టణ ప్రజలను చిరుత భయబ్రాంతులకు గురిచేస్తోంది. అటవీశాఖ, పోలీసు బృందాలతోపాటు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక రెస్క్యూ టీం రెండు బోన్‌లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నా చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. గత నెల 30న కనిపించిన చిరుత తరచుగా గుట్టపై ఉన్న గుండ్లు, బండరాళ్లపై తిరగాడుతూ కనిపిస్తోంది. పోలీసులు, అటవీ బృందాలు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ ఏమాత్రం దొరకడంలేదు. కలెక్టర్ విజయేందిర, ఎస్పీ జానకి స్వయంగా గుట్టపైకి ఎక్కి చిరుత సంచారాన్ని పర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి గాలింపు చేపడుతున్నా బోనుకు చిక్కడం లేదు. తాజాగా మంగళవారం సాయంత్రం టీడీగుట్ట ఫైర్‌స్టేషన్ ఎదురుగా గుట్టపై చిరుత కనిపించడంతో స్థానికులు వెంటనే అటవీ, పోలీసు శాఖల అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఎఫ్‌ఓ రాంబాబు, డీఎఫ్‌ఓ సత్యనారాయణ, సీఐ అప్పయ్య సిబ్బందితో అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టి పరిస్థితిని పర్యవేక్షించారు. అప్పటికే చిరుత తప్పించుకోవడంతో చేసేది లేక వెనుదిరిగారు. చిరుతను చూసేందుకు కోస్గి రోడ్డుపై జనం గుమిగూడటంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. టీడీగుట్ట పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆటోల ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు. అయితే తమను చిరుత బారినుంచి కాపాడాలని స్థానికులు అటవీ, పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు.

మళ్లీ కనిపించిన చిరుత