
అమ్మకు బోనం.. పులకించిన జనం
జిల్లావ్యాప్తంగా మంగళవారం పలు ప్రాంతాల్లో ఆషాఢ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పుల దరువుల మధ్య ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించేందుకు బోనాలతో మహిళలు బారులుతీరారు. జిల్లాకేంద్రంలోని సద్దలగుండు, పాతపాలమూరు, అప్పన్నపల్లి, ఎదిర, బండమీదిపల్లి, భూత్పూర్, హన్వాడ, నవాబుపేట, తదితర ప్రాంతాలు ఆధ్యాత్మికతతో పరవశించాయి. దేవరకద్రలోని పోచమ్మతల్లికి అంబలి గంపలతో భక్తులు ప్రదక్షిణలు చేశారు. మహిళలు వెదురు గంపలో వేప మండలు, అంబలి నింపిన కుండలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఆలయం చుట్టూ ఐదుసార్లు ప్రదక్షిణలు చేసి.. అంబలిని కిందకు కుమ్మరించారు. నేలపై పోసిన అంబలి సాకగా పారిన తర్వాత దానిపై పసుపు, కుంకుమ చల్లి దేవతకు నైవేద్యం సమర్పించారు. ఈ తర్వాత సాకగా పోసిన అంబలి కోసం కాపరులు పోటీపడ్డారు. ఈ వేడుక దాదాపు రెండు గంటల పాటు సాగింది. – దేవరకద్ర/స్టేషన్ మహబూబ్‌నగర్

అమ్మకు బోనం.. పులకించిన జనం