
కలెక్టరమ్మా.. కనికరించమ్మా
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): నా భూమి కబ్జాకు గురైంది విడిపించండి అని ఒకరు.. నా పేరుపై పట్టా ఉంది కానీ, ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని మరొకరు... నా భర్త చనిపోయాడు పింఛన్ ఇప్పించండి అని ఇంకొకరు.. ఇలా ఏదో ఒక సమస్యతో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి జిల్లావ్యాప్తంగా బాధితులు వస్తుంటారు. అయితే ఎన్నిసార్లు తిరిగినా ఆయా సమస్యలకు పరిష్కారం లభించలేకపోతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి.. కిందిస్థాయి అధికారులకు బదలాయించడం మినహా.. పెద్దగా ఉపయోగం ఉండటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అర్జీలు పెట్టుకున్నా.. మళ్లీ మళ్లీ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రతి సోమవారం వందకు తగ్గకుండా వినతులు వస్తుంటాయి. ఇందులో భూ వివాదాలు, ఆసరా పింఛన్లు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు తరలివస్తున్నారు.
రెఫర్ చేయడంతో సరి..
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు రెఫర్ చేయడంతో సరి పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలా రెఫర్ చేసిన దరఖాస్తులు పూర్తిస్థాయిలో పరిష్కారం అవుతున్నాయా.. లేదా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారే తప్ప సమస్యకు పరిష్కారం చూపించడం లేదని విమర్శిస్తున్నారు. కొందరు వినతులు పట్టించుకోకపోగా, తమపై అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మండల కేంద్రాల్లోనూ..
ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోనే కాకుండా మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో సైతం ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే మండల స్థాయిలో సమస్యలు పెద్దగా పరిష్కారానికి నోచుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో అర్జీదారులు నేరుగా కలెక్టరేట్‌కే వస్తున్నారు. మండలాల్లో కన్నా కలెక్టర్‌కు బాధ చెప్పుకుంటే వెంటనే పరిష్కారం లభిస్తుందనే ఆశతో వస్తున్న ప్రజలకు ఇక్కడ కూడా నిరాశే ఎదురవుతోంది.
ఫిర్యాదుల స్వీకరణ, బదలాయింపునకే పరిమితమైన ‘ప్రజావాణి’
సమస్యల పరిష్కారంపై
అధికారుల్లో చిత్తశుద్ధి కరువు
ఫలితంగా వచ్చిన ఫిర్యాదులే మళ్లీ.. మళ్లీ
ఏళ్ల తరబడి కలెక్టరేట్ చుట్టూ
తిరుగుతున్న బాధితులు
భూ వివాదాలపైనే అత్యధికంగా అర్జీలు