వేతనాలు రాని ‘ఉపాధి’ | - | Sakshi
Sakshi News home page

వేతనాలు రాని ‘ఉపాధి’

Jul 21 2025 5:53 AM | Updated on Jul 21 2025 5:53 AM

వేతనాలు రాని ‘ఉపాధి’

వేతనాలు రాని ‘ఉపాధి’

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): గ్రామీణ ప్రాంత ప్రజలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకంలో పనిచేసే సిబ్బంది వేతనాల కోసం నెలల తరబడిగా ఎదురుచూడాల్సిన పరిస్థితి దాపురించింది. జిల్లావ్యాప్తంగా 331 మంది పనిచేస్తుండగా.. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎఫ్‌ఏలే కీలకం..

ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు వందరోజులపాటు పనులు కల్పించడంలో ఎఫ్‌ఏ (ఫీల్డ్‌ అసిస్టెంట్లు)లది పాత్ర కీలకం. కానీ, వేతనాలు సకాలంలో రాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీరితోపాటు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఇతర సిబ్బందికి సైతం నెలనెలా వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లావ్యాప్తంగా 16 గ్రామీణ మండలాలు ఉండగా.. 1, 37,407 జాబ్‌ కార్డులు, 2,26,377 మంది కూలీలు ఉన్నారు. ఇందులో యాక్టివ్‌గా ఉన్న జాబ్‌ కార్డులు 89,155 కాగా.. 1,34,275 మంది కూలీలు పనిచేస్తున్నారు.

మొత్తం 331 మంది సిబ్బంది..

జిల్లావ్యాప్తంగా ఎఫ్‌ఏలు 221 మంది, ఏపీఓలు 10, ఈసీలు 9, టీఏలు 50, కంప్యూటర్‌ ఆపరేట ర్లు 41 మంది కలిపి మొత్తం 331 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరంతా గ్రామాల్లో సంవత్సరానికి సరి పడా ఉపాధి పనులు గుర్తించి జాబ్‌ కార్డులు కలిగిన కూలీలకు పనులు కల్పిస్తున్నారు. టెక్నికల్‌ అసిస్టెంట్లు నూతనంగా గుర్తించిన పనులకు అంచనాలు వేయడం, పని ప్రదేశాల్లో కొలతలు వేయడం, రికార్డుల నిర్వహణ వంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. కంప్యూటర్‌ ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో మస్టర్లు పొందుపర్చడం, ఎఫ్‌ఎలకు మస్టర్లు ఇవ్వడం, నిధులు జనరేట్‌ చేయడం, ఈసీలు, ఏపీఓలు ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తారు.

భారమవుతున్న కుటుంబ పోషణ..

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఎఫ్‌ఎలు, ఇతర ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎఫ్‌ఎలు కూలీలకు పనులు తప్పనిసరిగా కల్పించాల్సి ఉంటుంది. దీంతో ఎఫ్‌ఎలు ఇతర పనులు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. వీరితోపాటు ఇతర ఉద్యోగులు సైతం నిత్యం కార్యాలయానికి రావాల్సిందే. కానీ, నెలనెలా వేతనాలు రాకపోవడంతో దుర్భర జీవితాలు గడుపుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ సైతం భారంగా మారుతోందని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సమస్యలు పరిష్కరించాలి..

ఎఫ్‌ఏలకు కనీస వేతనం రూ.26 వేలు అందజేయాలి. కాంట్రాక్ట్‌ విధానాన్ని రద్దు చేసి.. ఉద్యోగ భద్రత కల్పించి.. పే స్కేల్‌ ఇవ్వాలి. ఎఫ్‌ఎలకు అలవెన్స్‌లను వర్తింపజేయాలి. పెండింగ్‌లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలి. ఎఫ్‌ఏల సమస్యలను తక్షణమే పరిష్కరించి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి.

– వెంకట్‌నాయక్‌,

ఫీల్డ్‌ అసిస్టెంట్‌ యూనియన్‌ నాయకుడు

వేతనాలు అందించాలి..

ఉపాధి హామీ పథకంలో పనిచేసే ప్రతి ఒక్కరికి నెలనెలా వేతనాలు మంజూరు చేయాలి. మూడు, నాలుగు నెలలకోసారి వేతనాలు ఇస్తుండటంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ప్రభుత్వం స్పందించి ఉపాధి హామీ సిబ్బంది వేతనాల మంజూరులో నిర్లక్ష్యం చేయకుండా చూడాలి.

– శ్రీను, కంప్యూటర్‌ ఆపరేటర్‌,

మహబూబ్‌నగర్‌ ఎంపీడీఓ కార్యాలయం

రెండు, మూడు రోజుల్లో..

ఉపాధి హామీలో పనిచేస్తున్న ఎఫ్‌ఏలు, టీఏలు, ఈసీ, కంప్యూటర్‌ ఆపరేటర్ల జీతాలు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. బిల్లు చేయాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయి. వెంటనే బిల్లులు చేసి మరో రెండు, మూడు రోజుల్లో జీతాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – నర్సింహులు, డీఆర్‌డీఓ

సిబ్బందికి మూడు నెలలుగాఅందని జీతాలు

ఆర్థిక ఇబ్బందుల్లో ఎఫ్‌ఏలు, టీఏలు, ఈసీలు, ఏపీఓలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement