
నిరంతరాయంగా జారీ..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. కొత్త రేషన్ కార్డులు ఏ విధంగా జారీ చేయాలి.. అర్హతలు ఏమిటి అనే దానిపై సబ్ కమిటీ పలు సూచనలు చేసింది. వీటికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త కార్డుల కోసం, అలాగే కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసేందుకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వాటిని అధికారులు పరిశీలించి అర్హుల జాబితాను రూపొందించారు. కాగా రేషన్ కార్డుల జారీ నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియ అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు పొందలేక..
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందాలంటే రేషన్‌కార్డు తప్పనిసరి కావడంతో ఏడేళ్ల నుంచి అర్హులకు ప్రభుత్వ పథకాలు అందకుండాపోయాయి. ఈ క్రమంలో 18 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం, మీసేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్‌కార్డుల మంజూరు కోసం దరఖాస్తులు స్వీకరించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు లేకపోవడం నిరుపేద కుటుంబాలకు ఇబ్బందిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి రేషన్ కార్డులే ప్రామాణికమని లింక్ పెట్టడంతో అర్హత ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకోలేక ఇప్పటి వరకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 2018 నుంచి రేషన్ కార్డుల జారీ నిలిపివేయగా, రేషన్‌కార్డులు లేకపోవడంతో పలువురు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. ఏడేళ్లుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు కాకపోవడంతో ఉమ్మడి కుటుంబంలో ఉండి వేరుపడిన వారికి కార్డులు లేక వారంతా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంట్ తదితర గ్యారంటీ పథకాలను అందుకోలేకపోయారు.
గతంలో దరఖాస్తులు
స్వీకరించినా..
గతంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఆ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో కొత్త కార్డులు మంజూరు కాలేదు. ప్రజాపాలనలో రేషన్ కార్డులకు వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ప్రస్తుతం 2,53,229 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఇందులో 8,16,588 మంది కుటుంబ సభ్యులు నమోదై ఉన్నారు. కొత్తగా మంజూరైన 12,691 కార్డులతో కలిపి ఇప్పుడు 2,65,920 కాగా, ఇందులో కొత్తగా నమోదైన 91,040 మంది కుటుంబ సభ్యులతో కలిపి జిల్లాలో రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 9,07,628 చేరనుంది.
ఎక్కువగా చేర్పులు, మార్పులు
రేషన్ కార్డుల్లో మార్పులు, చెర్పుల కోసం ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయి. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, ఇప్పటికే ఉన్న కార్డుల్లో చేర్పులు, మార్పులు చేయాలని కోరుతూ కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 53 వేలకు పైగా దరఖాస్తులు వీటిపైనే రావడం విశేషం.