
కేఎస్పీని పర్యాటకంగా తీర్చిదిద్దుతాం
దేవరకద్ర: కొండల నడుమ పకృతి సిద్ధంగా ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారని, ఈ ప్రాజెక్టును రూ.10కోట్లతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డితో కలిసి కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వార సాగునీటిని వదిలిన సందర్భంలో విలేకరులతో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పర్యాటక రంగం వెనకబడిపోయిందని ఆరోపించారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రూ.3.5 కోట్లు, ఈ ఏడాది రూ. 6.5 కోట్లు మంజూరు చేసిందని, ఈ నిధులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నామన్నారు. త్వరలో పనులు సైతం ప్రారంభిస్తామని, పర్యాటకుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు.
అదనంగా ఒక్క ఎకరాకు నీరందలే..
ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో బీఆర్‌ఎస్ నాయకులు, వారి కుటుంబాలు బాగు పడ్డాయని ఆరోపించారు. కోయిల్‌సాగర్ కింద 50 వేల ఎకరాలకు సాగునీరిందిస్తామని గతంలో ఇక్కడికి వచ్చిన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్‌రావు ఇచ్చిన హామీ నేరవేర లేదని, అదనంగా ఒక్క ఎకరాకు నీరందించలేదని పేర్కొన్నాఉ. పదేళ్ల కాలంలో కోయిల్‌సాగర్ కాల్వల మరమ్మతు చేపట్టలేదని ఐవీఆర్‌సీఎల్ వారు కూడా చేతులెత్తేయడంతో పనులు జరగలేదని అరోపించారు. పాత టెండర్లను రద్దు చేసి కొత్తగా రూ.40 కోట్లతో కాల్వల మరమ్మతుకు టెండర్లు వేయడం జరిగిందన్నారు. కాల్వలన్నీ లైనింగ్‌తో మరమ్మతు చేపడతామని, అదనపు ఆయకట్టుకు నీరిందించే దశలో సీఎం, ఇరిగేషన్ శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. గ్రావిటీ కెనాల్‌ను త్వరలో ఇరిగేషన్ మంత్రి ప్రారంభిస్తారని, దీని వల్ల 20 గ్రామాల్లోని 10 వేల ఎకరాలకు అదనంగా సాగు నీరిందుతుందని, అజిలాపూర్ లిఫ్ట్, చౌదర్‌పల్లి లిఫ్ట్‌ను మంజూరు చేయించామని వీటి వల్ల 18 వేల ఎకరాలకు అదనంగా సాగునీరిందించే దశలో పనులు చేపట్టడం జరిగిందన్నారు.
రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తాం
రైతులు నీటి వృథా చేయొద్దు
పెండింగ్ పనులు పూర్తి చేసి మరో 50 వేల ఎకరాలకు నీరందిస్తాం
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
రైతు సంక్షేమమే ధ్యేయం
రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, రైతు రుణమాఫీ, రైతు భరోసాను అందించిడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతుల కోరిక మేరకు కరిగెట చేసి వరినాట్లు వేసుకోవడానికి కోయిల్‌సాగర్ కుడి ఎడమ కాల్వ ద్వార నీటిని వదలడం జరిగిందన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు నీటిని ఆలస్యంగా వదిలేవారని, ఈ ఏడాది కోయిల్‌సాగర్‌కు గరిష్ట స్థాయిలో నీరు చేరడం వల్ల ముందుగానే నీటిని వదలడం జరిగిందన్నారు. వానాకాలం చివరి వరకు నీటి విడుదల ఉంటుందని, రైతులు తమ పొలాలకు పారిన తరువాత కింది పొలాలకు వదిలే విధంగా చూడాలన్నారు. అలాగే గొలుసు కట్టు చెరువులను కూడా నింపడం జరుగుతుందని అన్నారు.

కేఎస్పీని పర్యాటకంగా తీర్చిదిద్దుతాం