
నదిలో పడి వివాహిత మృతి
ఎర్రవల్లి: కృష్ణానదిలో పడి ఓ వివాహిత మృతిచెందిన ఘటన ఇటిక్యాల ఠాణా పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేష్ కథనం మేరకు.. మహబూబ్‌నగర్‌కు చెందిన గుబ్బా చంద్రకళ (50) దైవ దర్శనానికిగాను ఆదివారం బీచుపల్లికి వెళ్లింది. సోమవారం ఉదయం పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి నీటి పంపునకు తగిలి అక్కడే నిలిచింది. జాలర్లు గుర్తించి ఒడ్డుకు చేర్చి చూడగా ఆమె అప్పటికే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల మార్చురీకి తరలించి భర్త గోపాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
గుర్తుతెలియని
మృతదేహం లభ్యం
అలంపూర్: క్యాతూర్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌ఐ వెంకటస్వామి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా.. అలంపూర్ మండలంలోని క్యాతూర్ గ్రామ శివారులో ఆర్డీఎస్ పిల్ల కాలువలో సోమవారం గుర్తు తెలియని మృతదేహం గుర్తించినట్లు తెలిపారు. మృతుడి వయస్సు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 70285కు ఫోన్ చేయాలసి ఎస్‌ఐ కోరారు.
కేజీబీవీలో సీట్లిప్పిస్తామని మోసం : వ్యక్తిపై కేసు
ఉండవెల్లి: ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వారిని, ఆన్‌లైన్ మోసాలను చూశాం. కానీ, కొత్తగా కేజీబీవీలో సీట్లిప్పిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులతో డబ్బులు, సర్టిఫికెట్లు తీసుకుని మోసం చేసిన ఘటన ఉండవెల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాలిలా.. మండలంలోని కలుగోట్ల శివారులో ఉన్న కేజీబీవీకి గద్వాల మండలంలోని తెలుగోనిపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు బాలికల అడ్మిషన్ కోసం తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. ఆ తర్వాత గత నెల 20న కేజీబీవీకి అలంపూర్ మండలానికి చెందిన దివాకర్ వచ్చి తల్లిదండ్రులను పరిచయం చేసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలించి తాను అడ్మిషన్ ఇప్పిస్తానని, ఇందుకోసం ఖర్చవుతుందని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అంగీకరించారు. ఈ మేరకు తెలుగు పరశురాముడు రూ.18 వేలు, రాముడు రూ.13 వేలు కలిపి మొత్తం రూ.31 వేలు దివాకర్‌కు అందజేశారు. సీట్లు వచ్చాక ఫోన్ చేస్తామని ఆ రోజు రావాలని చెప్పి పంపారు. తర్వాత కొన్ని రోజులపాటు బాధితులు ఫోన్ చేయగా.. స్పందించకపోవడంతో మోసపోయామని గుర్తించి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. సోమవారం తెలుగు పరశురాము డు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శేఖర్ తెలిపారు.
వక్ఫ్ భూమి విక్రయించిన ముగ్గురిపై కేసు నమోదు
గద్వాల క్రైం: వక్ఫ్ భూమికి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి మహిళకు విక్రయించి మోసం చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్ తెలిపారు. వివరాలిలా.. పట్టణానికి చెందిన ఓ మహిళకు రాఘవేంద్ర (ధరూర్‌మెట్) కాలనీ శివారులో వక్ఫ్ భూమికి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి రూ.3 లక్షలకు విక్రయించారు. అయితే సదరు మహిళ కొనుగోలు చేసిన క్రమంలో తప్పుడు ధ్రువపత్రాలతో భూమిని విక్రయించినట్లు గుర్తించింది. ఈ స్థలానికి మున్సిపల్ కార్యాలయంలో ఇంటి నంబర్ సైతం లేకపోవడంతో మోసపోయినట్లు సోమవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మహ్మద్‌నసీబ్, మహ్మద్‌యాకుబ్, కుర్వ శ్రీనివాసులుపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
‘పీఎం కిసాన్ ఫైల్’తో రూ.లక్ష మాయం
జడ్చర్ల: వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన పీఎం కిసాన్ ఏపీకే ఫైల్‌ను ఓపెన్ చేసిన వెంటనే తన బ్యాంకు ఖాతా నుంచి రూ.లక్ష మాయం అయినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన సోమవారం జడ్చర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. స్థానిక బాలాజీనగర్‌కు చెందిన ఎండీ అంజూమ్ అలీకి ఈనెల 7న వాట్సాప్ గ్రూప్‌లో పీఎం కిసాన్ యోజన ఏపీకే ఫైల్ వచ్చింది. ఆ ఫైల్‌ను క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసిన తర్వాత తన గూగుల్ పే నుంచి రూ.50 వేల చొప్పున రెండు సార్లు బ్యాంకు ఖాతా నుంచి డ్రా అయినట్లు గుర్తించాడు. వెంటనే సైబర్ క్రైంకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
110 లీటర్ల కల్లు స్వాధీనం
గద్వాల క్రైం: ప్రభుత్వ అనుమతి లేకుండా కల్లు విక్రయిస్తున్న నలుగురుపై కేసులు నమోదు చేసినట్లు గద్వాల ఎకై ్సజ్ సీఐ గణపతిరెడ్డి తెలిపారు. పట్టణ శివారులో ప్రభుత్వ అనుమతి లేకుండా కృష్ణ, వెంకట్రాములు, వెంకటేష్, పద్మ గుట్టుగా కల్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఎస్‌టీఎఫ్, డీటీఎఫ్, గద్వాల ఎకై ్సజ్ సిబ్బంది మూడు బృందలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 110 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. దాడుల్లో శ్రీకాంత్‌రెడ్డి, వీరేష్‌లింగం పాల్గొన్నారు.